Sakshi News home page

ఇక.. నేటి నుంచి మరో రెండు గ్యారంటీలు ప్రారంభం

Published Wed, Feb 28 2024 1:48 AM

- - Sakshi

నేటి నుంచి అమలులోకి రూ.500కు గ్యాస్‌, ఉచిత విద్యుత్‌ పథకాలు
జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగదారులు 1,61,099 మంది
ప్రజాపాలనలో గ్యాస్‌ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారు 2,30,412 మంది
వీరందరికీ చేకూరనున్న లబ్ధి

సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి కింద రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం నుంచి ఈ రెండు పథకాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు పంపించింది. తెల్ల రేషన్‌కార్డు (ఆహార భద్రతా కార్డు) ప్రామాణికంగా ఈ రెండు పథకాలను వర్తింపజేయనున్నారు. వీటి ద్వారా జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ అందడంతో పాటు, నగదు బదిలీ పద్ధతిన గ్యాస్‌ వినియోగదారులకు రూ.500లకే సిలిండర్‌ అందనుంది.

జిల్లాలో 2,16,942 ఆహార భద్రత కార్డులు
జిల్లాలో 2,16,942 ఆహార భద్రత కార్డులున్నాయి. జిల్లాలో 3,11,415 గృహ వినియోగ గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా.. ప్రజాపాలనలో గ్యాస్‌ సబ్సిడీ కోసం 2,30,412 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్యాస్‌ వినియోగదారులు ముందుగానే మొత్తం డబ్బులు చెల్లించి సిలిండర్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తరువాత ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.500పోను మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేస్తుంది. తెల్లరేషన్‌ కార్డుదారులకు ప్రతి రీఫిల్‌కు రూ.500సబ్సిడీ అందనుంది. గడిచిన మూడు సంవత్సరాల్లో వినియోగదారులు గృహ అవసరాలకు వాడిన గ్యాస్‌ సిలిండర్ల ఆధారంగా గ్యాస్‌ సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేకంగా లెక్కలు తీశారు.

మార్చి1 అనంతరం జీరో బిల్లులు..
జిల్లాలో ఉచిత కరెంట్‌ కోసం 2,09,899 మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 200 యూనిట్ల లోపు వాడే గృహ విద్యుత్‌ వినియోగదారులు 1,61,099 మంది ఉన్నారు. వీరి వివరాలను విద్యుత్‌ శాఖ సేకరించింది. లబ్ధిదారుల స్థానికత గుర్తింపు కోసం ఆధార్‌ కార్డు, ఆహార భద్రతా కార్డు, ఫోన్‌నంబర్లు సేకరించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబంలో ఒక నెలలో 200 యూనిట్ల వరకు జీరో బిల్లును ఇస్తారు. మార్చి 1 అనంతరం వచ్చే విద్యుత్‌ బిల్లులతో జీరో బిల్లు పథకం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇవి చదవండి: లక్ష కోట్లు.. 5 లక్షల ఉద్యోగాలు

Advertisement

What’s your opinion

Advertisement