పశుసంవర్ధక డీడీ అచ్చెన్న మృతిపై వీడని మిస్టరీ | Sakshi
Sakshi News home page

పశుసంవర్ధక డీడీ అచ్చెన్న మృతిపై వీడని మిస్టరీ

Published Sun, Mar 26 2023 2:10 AM

-

కడప అర్బన్‌ : కడపలోని పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తూ గువ్వల చెరువు ఘాట్‌లో శవమై తేలిన అచ్చెన్న సంఘటనపై ఉమ్మడి జిల్లాల పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు కడప ఒన్‌టౌన్‌ పోలీసుల బృందం, మరోవైపు అన్నమయ్య జిల్లా రామాపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 12న తన ఇంటి నుంచి వెళ్లిన అచ్చెన్న చర్చికి వెళ్లి, తరువాత ఆఫీసుకు వెళ్లి వస్తానని ఇంటిలో చెప్పి వెళ్లినట్లు అతని కుమారుడు డాక్టర్‌ క్లింటన్‌ చక్రవర్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తరువాత సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చిన సమయం నుంచి పోలీసులు ఆరా తీశారు. సీసీ కెమెరాల ఫుటేజీలను కడప నుంచి రామాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డు వరకు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. అలాగే ఆయన సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ డేటాపై కూడా ఆరా తీస్తున్నారు. ఆయన మృతదేహం ఈనెల 24న గువ్వల చెరువు ఘాట్‌లో లభ్యమైనపుడు కుటుంబ సభ్యులను పిలిపించి నిర్ధారణ చేసిన తరువాత డాక్టర్లు వచ్చి సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం చేయించారు. తరువాత ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు కర్నూలు జిల్లాకు ఆయన మృతదేహాన్ని తీసుకుని వెళ్లి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఆయన మరణం సాధారణమైనదా? లేక ఆత్మహత్యనా? లేక హత్యకు గురయ్యాడా? అనే ప్రాథమిక విషయాలపై పోస్టుమార్టం నివేదిక రావాల్సిందేనని పోలీసులు, అధికారులు తెలియజేస్తున్నారు. అనారోగ్యంగా వుండి చనిపోతే సాధారణ మరణమని భావిస్తున్నారు. ఏది ఏమైనా అచ్చెన్న మరణానికి గల కారణంపై ఇంకా అధికారులు ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది.

సమగ్ర విచారణ చేస్తాం: డీఎస్పీ

రామాపురం : కడప పశుసంవర్ధక శాఖలోని వెటర్నరీ పాలీక్లినిక్‌(వీపీసీ) డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ అచ్చెన్న మృతిపై అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేపడుతామని డీఎస్పీ శ్రీధర్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిలోని రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులోని కోనేటి బండల సమీపంలో శుక్రవారం అచ్చన్న(58) మృతదేహాన్ని గుర్తించామని పేర్కొన్నారు. ఆ గ్రామం వీఆర్‌ఓ కల్లూరు ఫాతిమాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతుడి వద్ద గల ఆనవాల మేరకు కుటుంబీకులకు సమాచారం అందించామన్నారు. లక్కిరెడ్డిపల్లె సీఐ వరప్రసాద్‌, రామాపురం ఎస్‌ఐ కొండారెడ్డిలు సంఘటన స్థలానికి వైద్యులను పిలిపించి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారన్నారు. మృతదేహాన్ని కుటుంబీకులకు శుక్రవారం రాత్రి అప్పగించామని వివరించారు. పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా అచ్చెన్న విధులు నిర్వహిస్తున్న సమయంలో సస్పెండ్‌కు గురయ్యారని పేర్కొన్నారు. ఆ నోటీసులు తీసుకొన్నప్పటి నుంచి మనస్తాపానికి గురైనట్లు సమాచారం ఉందన్నారు. కుటుంబీకులను, ఆ శాఖ అధికారులను విచారణ చేస్తామన్నారు.

పలు కోణాల్లో

ఉమ్మడి జిల్లాల పోలీసుల దర్యాప్తు

సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా

లోతుగా విచారణ

పోస్టుమార్టం నివేదిక ద్వారా హత్యా? ఆత్మహత్యా?నా తేల్చనున్న వైనం

మాకు ఎలాంటి సంబంధం లేదు

– జిల్లా పశుసంవర్ధశాఖ అధికారి డాక్టర్‌ శారదమ్మ

కడప అగ్రికల్చర్‌ : జిల్లా బహుళార్థ పశువైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న అచ్చెన్న అదృశ్యం, మృతిపై మాకు ఎటువంటి సంబంధం లేదని జిల్లా పశుసంవర్ధశాఖ అధికారి డాక్టర్‌ శారదమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్‌ అచ్చెన్న విడతల వారీగా ఇద్దరు అసిస్టెంట్‌ డైరెక్టర్లు, ఒక డాక్టర్‌, ఇద్దరు కింద స్ధాయి సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా సరెండర్‌ చేస్తూ వారి జీతాలను నిలిపి వేసి సిబ్బందిని వేధించారని ఆమె పేర్కొన్నారు. ఏపీఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ నుంచి సిబ్బంది పేర్లను కూడా నిబంధనలకు వ్యతిరేకంగా తొలగించారన్నారు. ఈ విషయమై ప్రభుత్వం నియమించిన నిజ నిర్థారణ కమిటీ రిపోర్టు మేరకు ఈ నెల 15న అచ్చెన్నను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు అందాయన్నారు. అంతకు ముందు మార్చి 12న డాక్టర్‌ అచ్చెన్న తన కుమార్తెతో చర్చిలో కలిసి తర్వాత కనిపించడం లేదని ఆయన కుమారుడు కడప వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. కావున ఆయన అదృశ్యంపై, మృతిపై మాకు ఎటువంటి సంబంధం లేదని ఆమె తెలిపారు.

డీడీ అచ్చెన్న మృతి బాధాకరం

– వెటర్నరీ అసోషియేషన్‌

పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న మృతి బాధాకరమని వెట్నరరీ అసిస్టెంట్‌ సర్జన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శివరామిరెడ్డి, అనిమెల్‌ హజ్‌బెండరీ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతాజీ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఉద్యోగులను సరెండర్‌ చేయడంతోనే అసోసియేషన్‌ ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని వివరించారు.

డీడీ అచ్చెన్న మృతిపై సమగ్ర విచారణ జరపా లని నేషనల్‌ హ్యూమన్‌ రైట్‌ ప్రొటెక్షన్‌ ఫోరం కడప జిల్లా అధ్యక్షుడు నరసింహులు డిమాండ్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement