పేదింటి బిడ్డలు.. వాలీబాల్‌లో మెరికలు | Sakshi
Sakshi News home page

పేదింటి బిడ్డలు.. వాలీబాల్‌లో మెరికలు

Published Mon, Jun 5 2023 12:06 AM

వాలీబాల్‌లో ప్రతిభ చాటి కై వసం చేసుకున్న కప్పులు, మెడల్స్‌ - Sakshi

రాజంపేట టౌన్‌ : ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కూచివారిపల్లెకు చెందిన వాలీబాల్‌ క్రీడాకారులు. తండ్రి సంచార వ్యాపారానికి, తల్లి కూలీ పనులకు వెళితేనే వారి కుటుంబం గడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న రామ్మోహన్‌, మణెమ్మల ముగ్గురు పిల్లలు వాలీబాల్‌ క్రీడలో ప్రతిభ కనబరుస్తూ..జాతీయ స్థాయిలో రాణిస్తూ.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సాధారణంగా ఎవరి కుటుంబంలో అయినా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో రంగంలో ప్రతిభ కనబరుస్తారు. అయితే వీరి కుటుంబంలో ముగ్గురు పిల్లలు కూడా వాలీబాల్‌ క్రీడపై మక్కువ పెంచుకొని రాణిస్తుండటం విశేషం. తేజ, సరిత, సాయిప్రతాప్‌లు పాఠశాల స్థాయిలోనే వాలీబాల్‌లో ప్రతిభచాటడాన్ని గమనించిన రిటైర్డ్‌ పీడీ, వాలీబాల్‌ కోచ్‌ వారిపై ప్రత్యేక దృష్టిసారించి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఫలితంగా డిగ్రీ పూర్తి చేసుకొని పోలీస్‌ సెలక్షన్స్‌ ప్రయత్నాల్లో ఉన్న తేజ ఏడుమార్లు జాతీయ స్థాయి పోటీల్లో ఆడింది. ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సరిత ఇప్పటి వరకు తొమ్మిదిమార్లు జాతీయ స్థాయి పోటీల్లో ఆడి రెండుమార్లు బెస్ట్‌ప్లేయర్‌ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అలాగే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాయిప్రతాప్‌ ఇటీవలే జాతీయ స్థాయి వాలీబాల్‌లో పోటీల్లో ఆడారు.

తలదాచుకునేందుకు

సరైన గూడు కూడా లేని దుస్థితి

జాతీయ స్థాయిలో రాణిస్తున్న వాలీబాల్‌ క్రీడాకారులది ఒక విధంగా కఠిక పేదరికమనే చెప్పాలి. సరైన గూడు కూడా లేక పోవడంతో ఐదుగురు ఉన్న ఈ కుటుంబం తలదాచుకునేందుకు ఇబ్బందులు పడుతోంది. తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా తమ పిల్లల పోషణ, ఇతర అవసరాలకు కూడా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందువల్ల దాతలు ఎవరైనా తమ పిల్లలకు చేయూతనివ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు

జాతీయ స్థాయి క్రీడాకారులు

క్రీడాకారుల పేదరికానికి నిదర్శనం ఈ ఇళ్లు
1/1

క్రీడాకారుల పేదరికానికి నిదర్శనం ఈ ఇళ్లు

Advertisement

తప్పక చదవండి

Advertisement