కువైటీ వేధింపుల నుంచి మహిళకు విముక్తి | Sakshi
Sakshi News home page

కువైటీ వేధింపుల నుంచి మహిళకు విముక్తి

Published Fri, Sep 1 2023 2:40 AM

మహబూబ్‌ జాన్‌కు ఔట్‌ పాస్‌పోర్టు, టికెట్‌ 
అందిస్తున్న ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యుడు - Sakshi

కడప కార్పొరేషన్‌ : ఎడారి దేశమైన కువైట్‌లో సేఠ్‌ వేధింపులకు గురవుతున్న మహిళకు మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషా, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులు విముక్తి కల్పించారు. వివరాలిలా ఉన్నాయి.. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన షేక్‌ మహబూబ్‌ జాన్‌ అనే మహిళ ఆరుమాసాల క్రితం జీవనోపాధి కోసం హౌస్‌ మెయిడ్‌(ఇంటి పని) నిమిత్తం కువైట్‌కు వెళ్లింది. కువైటీ(సేఠ్‌్‌) ఇంట్లో విశ్రాంతి ఇవ్వకుండా అర్థరాత్రి వరకూ పనులు చేయించడంతో ఆమె అనారోగ్యానికి గురైంది. సేఠ్‌ ఆమెను ఆసుపత్రిలో చూపించకుండా పని ఎగ్గొట్టేందుకు నాటకాలు ఆడుతున్నావని గదిలో పెట్టి బంధించాడు. తాను పడుతున్న బాధలను ఆమె ఎలాగోలా ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా తెలిపింది. వారు ఎమ్మెల్యే నవాజ్‌ బాషాను కలిసి తమ కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉంది, ఎలాగైనా ఇండియాకు రప్పించాలని ప్రాధేయపడ్డారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ఛైర్మెన్‌ మేడపాటి వెంకట్‌, డైరెక్టర్‌ ఇలియాస్‌ల దృష్టికి తీసుకుపోయారు. వారు భారత రాయబార అధికారులకు వివరాలను మెయిల్‌ చేసి మహబూబ్‌ జాన్‌ను ఇండియాకు పంపే ఏర్పాట్లు చేయాలని అభ్యర్థించారు. వైఎస్సార్‌సీపీ కువైట్‌ కన్వీనర్‌ ఎం బాలిరెడ్డి ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి సేఠ్‌్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. దీంతో మహబూబ్‌ జాన్‌ను ఇంటి నుంచి భారత ఎంబసీ వద్దకు తీసుకుపోయి భోజన వసతి, సౌకర్యాలు కల్పించారు. ఆమెకు పాస్‌పోర్టు లేనందున ఔట్‌ పాస్‌పోర్టు తయారు చేయించి, టికెట్‌ ఖర్చులు కూడా ఆయనే భరించారు. 31వ తేది అర్థరాత్రి 2.20 గంటలకు ఆమె ఇండియాకు బయలుదేరింది. ఈ సందర్భంగా మహబూబ్‌ జాన్‌ మాట్లాడుతూ తాను సజీవంగా తమ తల్లిదండ్రులను కలుస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ద్వారా ప్రవాసాంధ్రులకు సేవలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.

చొరవ చూపిన ఎమ్మెల్యే నవాజ్‌ బాషా,

ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులు

Advertisement
Advertisement