పట్టాలు తప్పిన రైల్వే జంక్షన్లు.! | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన రైల్వే జంక్షన్లు.!

Published Sat, Oct 14 2023 1:08 AM

- - Sakshi

రాజంపేట: రైల్వే జంక్షన్లు అభివృద్ధిలో పట్టాలు తప్పాయి. హోదా ఘనం.. ప్రగతిలో హీనంగా మారాయి. సాదాసీదా స్టేషన్లుగానే మిగిలి పోయాయి. ముంబయి–చైన్నె రైల్వే మార్గంలోని గుత్తి–రేణిగుంట మధ్య మూడింటిని జంక్షన్ల స్టేషన్‌లుగా గుర్తించారు. కడప, ఎర్రగుంట్ల, ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్లను దక్షిణ మధ్య రైల్వే ఇటీవల జంక్షన్‌లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పేరుకు మాత్రమే జంక్షన్‌స్టేషన్లుగా నిలిచిపోయాయి. కేవలం ప్రకటనతో మమా అనిపించారు. ఇతర ప్రాంతాల వాటితో అభివృద్ధితో పోలికే లేకుండా పోయింది. కొన్ని రైళ్లు కూడా ఆగడం లేదు.

రైలు మార్గాల అనుసంధానతతో..
రైల్వేబడ్జెట్‌ మేరకు 1996–1997లో ప్రారంభమైన ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గంతో ఎర్రగుంట్లను జంక్షన్‌గా గుర్తించారు. 2008–2009లో కడప –బెంగళూరు రైలుమార్గం ఏర్పాటైంది. ఈ మార్గంతో కడప రైల్వేస్టేషన్‌ జంక్షన్‌గా ఏర్పడింది. 2005–2006లో కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైలుమార్గం ఏర్పాటైంది. ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్‌.. కృష్ణపట్నం రైలుమార్గానికి అనుసంధానత (కనెక్టివిటి) స్టేషన్‌ కావడంతో జంక్షన్‌గా గుర్తించారు.

అటకెక్కిన కడప రీడెవలప్‌మెంట్‌
ఎయిర్‌పోర్ట్సును తలిపించేలా రైల్వేస్టేషన్లను రీ డెవలప్‌మెంట్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కడప రైల్వేస్టేషన్‌ను రీడెవలప్‌మెంట్‌ చేసేందుకు గతంలో రైల్వేశాఖ నిర్ణయించింది. ఆ తర్వాత అటకెక్కించింది. ఏ కేటగిరిలో కడప రైల్వేస్టేషన్‌ ఉంది. విశాలమైన ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆధునిక సౌకర్యాల లేమి కనిపిస్తోంది. రీడెవలప్‌మెంట్‌ వెనక్కి వెళ్లిపోయిందనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు కడప–బెంగళూరు రైలు మార్గ అనుసంధానంతో జంక్షన్‌గా ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదు.

కాలుష్యకోరల నుంచి విముక్తేదీ?
ఎర్రగుంట్ల రైల్వే జంక్షన్‌ను కాలుష్య కోరల్లో నుంచి విముక్తి కల్పించే దిశగా రైల్వే శాఖ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. పైగా ఇప్పుడు లోకోరన్నింగ్‌స్టాప్‌ క్రూసెంటర్‌ ఏర్పాటు చేశారు. దాని నిర్వహణ కూడా విఫలమైందని రన్నింగ్‌స్టాప్‌ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. డివిజన్‌ అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల అనవసర వ్యయంతో రైల్వేకిఽ భారీగా నష్టం కలిగించారు. ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేసే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. స్థల లేమి సమస్య ఓ వైపు పీడిస్తోంది.

గ్రామీణ స్టేషన్‌గానే ఓబులవారిపల్లె
ఓబులవారిపల్లె జంక్షన్‌ నేటికీ గ్రామీణ రైల్వేస్టేషన్‌గానే కొనసాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్స్‌ లేవు. పైగా స్టేషన్‌ ఔటరు నుంచి విజయవాడ డివిజన్‌ పరిధిలోకి వెళ్లిపోయింది. కేవలం స్టేషన్‌ మాత్రమే గుంతకల్‌ డివిజన్‌లో ఉంది. జంక్షన్‌న్‌ కాగానే స్టేషన్‌ రూపురేఖలు మారిపోతాయని ఇక్కడి ప్రాంతీయులు భావించారు. అయితే కలగానే మిగిలిపోయింది.

అభివృద్ధి చేయాలి
ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా రైల్వేబోర్డు యోచించాలి. ఈ విషయాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను. అన్ని రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలని కోరుతాను. ఇప్పటికీ ఎంపీ రైల్వే సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నారు. –కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు

కేంద్రం దృష్టి సారించాలి
కడప రైల్వేస్టేషన్‌ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అధునాతన సౌకర్యాలు కల్పించాలి. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కడప రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు రైల్వే శాఖ మంత్రి, అధికారులను కలిశారు. పేరుకే జంక్షన్‌లా ఉంది. ఎయిర్‌పోర్టులా తీర్చిదిద్దాలి. –బీహెచ్‌ ఇలియాస్‌, డైరెక్టర్‌, ఏపీఎన్‌ఆర్టీఎస్‌, కడప

Advertisement
Advertisement