‘మాధవీరెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. విమర్శిస్తే సహించం’ | Sakshi
Sakshi News home page

‘మాధవీరెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. విమర్శిస్తే సహించం’

Published Sat, Oct 21 2023 1:12 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: అర్హత ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. పార్టీలు, వర్గాలకతీతంగా సంక్షేమం అండగా నడిపిస్తోంది. నాటి చంద్రబాబు సర్కార్‌లో ఉన్నట్లు జన్మభూమి కమిటీల సిఫార్సులు అవసరం లేదు. ప్రజల వద్దకే పాలన వచ్చి చేరింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అపార ప్రజా మద్దతు దక్కుతోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ఇన్‌ఛార్జులు కల్లిబొల్లి కబుర్లతో ప్రజల చెంతకు చేరితే, ప్రతిఘటన ఉత్పన్నమవుతోంది. ప్రజానీకం నిలదీస్తే సమాధానం చెప్పుకోలేక మథన పడుతున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతోన్న నేపథ్యం తెరపైకి వస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

► 2019, మే నెల 30న సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదే రోజున వర్గాలు, పార్టీలు, ప్రాంతాలను చూడకుండా రాజకీయాలకతీతంగా నవరత్నాలు అందిస్తామని స్పష్టం చేశారు. చెప్పిన మాట ప్రకారం తర, తమ, భేదం లేకుండా పథకాలకు అర్హులైతే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధి చేకూరుతోంది. ఇందులో తెలుగుతమ్ముళ్లుకు సైతం సంక్షేమం వర్తిస్తోంది. అప్పట్లో తెలుగుతమ్ముళ్లు నేతృత్వంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీల లాగా, మరెలాంటి సిఫార్సులు అవసరం లేదు. పాలన ప్రక్షాళన చేశారు. అర్హుల ఇళ్లు ముంగిటకు సంక్షేమం తీసుకెళ్లారు. కోవిడ్‌ వైరస్‌ విపరీతంగా వ్యాప్తి చెందిన వ్యవస్థలు అస్థవ్యస్థమైనా, సంక్షేమాన్ని అపలేదు. వెరశి ప్రజల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు దక్కతోంది.

టీడీపీ నేతలకూ సంక్షేమ ఫలాలు
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా రూ.7,197.48 కోట్లు నేరుగా లబ్ధి చేకూర్చింది. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు దక్కాయి. ఈ క్రమంలో టీడీపీ క్రియాశీలక నేతలకు సైతం పెద్ద ఎత్తున సంక్షేమం దక్కింది. బద్వేల్‌ మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సిలర్‌ సోమేశుల సుధామణి కుటుంబానికి రూ.11.6 లక్షలు సమకూరింది. ఖాజీపేట మండలశాఖ అధ్యక్షుడు తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి కుటుంబానికి రూ.5.25 లక్షలు దక్కింది. చాపాడు టీడీపీ నేత మార్తల నరసింహారెడ్డి కుటుంబానికి దాదాపు రూ.4 లక్షల లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా టీడీపీ క్రియాశీలక నేతలందరికీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌లో సంక్షేమ ఫలాలు దక్కాయి. టీడీపీ సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న నేతల వరకూ అర్హుల జాబితాలో ఉండడం మరో విశేషం.

విమర్శిస్తే సహించని ప్రజానీకం...
తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తే సామాన్య ప్రజలు సహించలేకున్నారు. కడపలో వైఎస్సార్‌ కాలనీలో ఇన్‌ఛార్జి మాధవీరెడ్డి మాటలను ఖండిస్తూ అడ్డుతగిలిన నేపథ్యమే ఉదాహరణ. ఈ పరిస్థితిలో మరింతగా రెచ్చిపోయిన అమె వ్యక్తిగతంగా మంత్రి అంజాద్‌బాషాపై ఆరోపణలు సంధించడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ప్రొద్దు టూరు, మైదుకూరు, కమలాపురం టీడీపీ ఇన్‌ఛార్జిలు గండ్లూరు ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్‌, పుత్తా నరసింహారెడ్డిలు ఇలాగే వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు మినహా ప్రజలకు పథకాలు అందలేదని కానీ, మ్యేనిఫెస్టో అమలు చేయలేదని కానీ ఆరోపణలు చేయడం లేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ప్రజల నుంచి టీడీపీ నేతలకు ప్రతిఘటన ఉత్పన్నం కావడం వెనుక సంక్షేమ పథకాలేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement