●పోలీసుస్టేషన్లు ప్రారంభం | Sakshi
Sakshi News home page

●పోలీసుస్టేషన్లు ప్రారంభం

Published Sat, Nov 11 2023 1:06 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: వారంతా సొంత మనుషులు. కష్టసుఖాల్లో వెన్నంటి నడిచిన సైనికులు. విపత్కర పరిస్థితుల్లో మనోధైర్యం నింపి, మీ వెంట మేమున్నామని చాటి చెప్పి, రాష్ట్రం వైపు నడిపించిన నేతలు. అలాంటి వారంతా ఒక్కచోటికి చేరడంతో ఆత్మీయత ఉట్టి పడింది. శుక్రవారం ఇడుపులపాయలో ఇదంతా ఆవిష్కరితమైంది.సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేముల మండలానికి చెందిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలను పేరుపేరునా పలికరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంటి పెద్ద కష్ట సుఖాలు స్వయంగా అడిగి తెలుసుకుంటుంటే అక్కడి వారి మోముల్లో ఆనందం పరవళ్లు తొక్కింది.

బ్రహ్మండంగా అభివృద్ధి పనులు చేస్తాండారు, మెట్ట భూములు సాగునీళ్లతో తడుస్తున్నాయి. పిల్లకాలువలకు లైనింగ్‌ పనులు చేయించండి సార్‌... 60శాతం మెట్ట భూములు మాగాణిగా మారుతాయి. బైరెటీస్‌, సున్నపురాయి, సుద్ధ బాగా దొరుకుతోంది, వాటి ఆధారిత పరిశ్రమలోస్తే ఇక్కడే యువతకు ఉద్యోగ ఉపాధి లభిస్తోందంటూ వేముల మండల వాసులు వివరిస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రద్ధగా ఆలకించారు. స్థానికులకు పరిష్కార మార్గాలను సూచిస్తూనే, రైతాంగం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి, తర, తమ, వర్గ బేధాలు లేకుండా ప్రజలకు అందిస్తున్న సంక్షేమం వివరాలను సీఎం వివరించారు. మీరంతా అండగా నిలవడంతోనే ఇది సాధ్యమైందని, పులివెందుల నియోజకవర్గ కుటుంబ సభ్యులైన వేముల మండల వాసులకు ధన్యవాదాలు తెలిపారు.

సన్నిహితులు..ఆత్మీయులతో మమేకం...

రెండు రోజుల పర్యటనలో ఓవైపు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, సమీక్షలు నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సామాన్యులతో మమేకమయ్యారు అంతరంగికులు సన్నిహితులతో సరదాగా గడిపారు.ఆత్మీయులను ఆలింగనం చేసుకున్నారు.

అధైర్యపడొద్దు..అండగా ఉంటాం...

ఇటీవల మృతి చెందిన పెండ్లిమర్రి మండల వైఎస్సార్‌సీపీ నేత సీవై రామ్మోహన్‌రెడ్డి కుటుంబసభ్యుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. మోహన్‌ మా కుటుంబ సభ్యుడు.. మీకు అండగా మేముంటాం. ఆధైర్యపడొద్దని ఆయన సతీమణి మాజీ ఎంపీపీ అనూరాధ, కుమారుడు శ్రీహర్ష, కుమార్తె శ్రీలక్ష్మిలకు ధైర్యం చెప్పారు. ఇడుపులపాయలోని సీఎం గెస్ట్‌హౌస్‌కు దివంగత రామ్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుల్ని పలిపించుకుని వారిని ఓదార్చారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డిలు రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న తీరుతెన్నులు, కుటుంబ పరిస్థితులను వివరించారు. నాన్న లేడనే బెంగ పెట్టుకోకుండా ఉన్నత చదువులు చదువుకోవాలని కుమార్తె శ్రీలక్ష్మికి ధైర్యం చెప్పారు.

సొంతమనుషుల్లా ఒకచోట చేరిన నేతలు

సామాన్యులతో మమేకమైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నూతనంగా నిర్మించిన రెండు పోలీసుస్టేషన్లు ప్రారంభం

సీఎం పర్యటన విజయవంతం

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన జిల్లాలో విజయవంతంగా ముగిసింది. తొలిరోజు రూ.64.54 కోట్లకు చెందిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేపట్టారు. రెండో రోజు రూ.4.5కోట్లతో నిర్మించిన రెండు పోలీసుస్టేషన్లు ప్రారంభించారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఆఽథారిటీ పరిధిలో చోటుచేసుకున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నేతలు, అధికారులు సీఎం పర్యటనలో పాల్గొని విజయవంతం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జిల్లాలోని ఆర్కేవ్యాలీ, జమ్మలమడుగులో పోలీసుస్టేషన్లు ప్రారంభించారు. రూ.1.75 కోట్లతో ఇడుపులపాయలో పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. రూ.2.75 కోట్లతో జమ్మలమడుగులో నిర్మించిన పోలీసుస్టేషన్‌ను వర్చువల్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. అనంతరం ఇడుపులపాయ పోలీసుస్టేషన్‌లో విజిటర్స్‌ బుక్‌లో ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుతూ సీఎం సంతకం చేశారు. స్టేషన్‌ ఆవరణలో పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్‌, సీఐ గోవిందరెడ్డి,పోలీసుసిబ్బందితో కలిసి గ్రూప్‌ ఫోటో దిగారు.

Advertisement
Advertisement