పాఠశాలల్లో పర్యవేక్షణ పక్కా | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో పర్యవేక్షణ పక్కా

Published Sat, Nov 18 2023 1:48 AM

ట్యాబుల్లో పాఠాలను వింటున్న 8వ తరగతి విద్యార్థులు   - Sakshi

కడప ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్ది సౌకర్యాలు కల్పించింది. అలాగే బోధన, పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయుల విధులు తదితర విషయాలను నిరంతరం పర్యవేక్షించేలా సంస్కరణలను చేపట్టింది. దీంతోపాటు పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పూర్థిస్థాయిలో వసతుల కల్పనే లక్ష్యంగా ప్రతి మండలానికి ఇద్దరు ఎంఈఓలను నియమించింది. వీరిలో ఒకరు పర్యవేక్షణ, మరొకరు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి...

జిల్లావ్యాప్తంగా 2849 పాఠశాలలు ఉన్నాయి. అందులో 2065 ప్రభుత్వం, 784 ప్రైవేట్‌ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1,52,697 మంది, ప్రైవేటు బడుల్లో 1,83,530 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం అధునాతనంగా తీర్చిదిద్ది కార్పొరేట్‌కు దీటుగా వసతులను కల్పించింది. ఇంగ్లీష్‌ మీడియం, ఐఎఫ్‌సీ ప్యానల్‌, డిజిటల్‌ విధానంలో బోధన, టోఫెల్‌ విధానంలో పరీక్షలు, సీబీఎస్‌ఈ సిలబస్‌, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసింది. వీటన్నింటి అమలు, పర్యవేక్షణ బాధ్యతలను ఎంఈఓలకు అప్పగించింది.

● జిల్లాలోని 36 మండలాల పరిధిలో 36 మంది రెగ్యులర్‌ ఎంఈఓలు ఉండాల్సి ఉండగా 22 మంది మాత్రమే రెగ్యులర్‌ ఎంఈఓ–1లు ఉండగా మిగతా 14 ఎఫ్‌ఏసీతో నడుస్తున్నాయి. వీటితోపాటు ఎంఈఓ–2 పోస్టుల్లో మాత్రం 36 మందిని భర్తీ చేశారు.

ఎంఈఓల విధులు..

● ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలను ప్రతి నిత్యం సందర్శించాలి. పాఠశాలలను నిశితంగా తనిఖీ చేయాలి. ఉపాధ్యాయులకు శిక్షణ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన కార్యక్రమాలు అమలయ్యేలా చూడాలి.

● పాఠశాలలకు అవసరమైన వాటిని అంచనా వేసే బాధ్యతను ఎంఈఓ–1 చేయాల్సి ఉంది.

● పాలనాపరంగా పాఠశాలల స్థాపన, గుర్తింపు పక్రియ, వాటిని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సర్వీస్‌కు సంబంధించిన అంశాలు, అధికారులు కేటాయించిన ఇతర విధులను సైతం పర్యవేక్షించాలి

● పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌, బడిబయట పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌పై చర్యలు, ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించిన అంశాలు, యూడైస్‌ నిర్వహణ లాంటి వాటిని ఎంఈఓ–2 పర్యవేక్షించాలి.

● పాఠశాలలకు వసతుల కల్పన, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, పాఠ్యపుస్తకాల సరఫరా, మధ్యాహ్నభోజన పథకం అమలు, పారిశుధ్యం, ప్రభుత్వ పథకాల అమలు వంటి విధులు నిర్వర్తించాలి.

నియామక ప్రక్రియ పూర్తి

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మండలానికి ఇద్దరు ఎంఈఓల నియామకం చేపట్టాం. ప్రభుత్వ నిర్ణయంతో పాఠశాలపై మరింత నిఘా పెరుగుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. సదుపాయాలు మెరుగుపడతాయి. – ఎద్దుల రాఘవరెడ్డి,

జిల్లా విద్యాశాఖ అధికారి

విద్యాభివృద్ధికి సీఎం కృషి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాల విద్యలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ బడులను రూపురేఖలు మార్చరు. పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. – మార్తాల వెంకటకృష్ణారెడ్డి, ఆర్‌జేడీ, పాఠశాల విద్య

ప్రభుత్వ, ప్రైవేటు బడుల నిర్వహణపై ఫోకస్‌

ప్రతి మండలానికి ఇద్దరు ఎంఈఓలు

పథకాల అమలుకు పటిష్ట చర్యలు

1/3

2/3

3/3

Advertisement
Advertisement