డిమాండుకు అనుగుణంగా పనిదినాలు | Sakshi
Sakshi News home page

డిమాండుకు అనుగుణంగా పనిదినాలు

Published Sat, Dec 2 2023 1:40 AM

మాట్లాడుతున్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ డైరెక్టర్‌ చిన్న తాతయ్య  - Sakshi

కడప సిటీ: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి డిమాండుకు అనుగుణంగా ఆర్థిక సంవత్సరంలో 100 రోజులకు తగ్గకుండా పనిదినాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ డైరెక్ట్‌ పి.చిన్నతాతయ్య పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా డ్వామా కార్యాలయంలో వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాలకు చెందిన డ్వామా పీడీలు పి.యదుభూషణరెడ్డి, ఎంసీ మద్దిలేటి, డీఆర్‌డీఏ పీడీ ఆనందనాయక్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు, మార్గదర్శకాలను జారీ చేశారు. వైఎస్సార్‌ జిల్లాను మెట్ట ప్రాంతంగా గుర్తించినట్లు చెప్పారు. 35 మండలాల్లో ముఖ్యమైన పనులు చేపట్టాలన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో ఇప్పటివరకు 72 లక్షల పనిదినాలు టార్గెట్‌ కాగా, నేటికి 68 లక్షల పనిదినాలను పూర్తి చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. మండలానికి కనీసం ఐదు అమృత్‌ సరోవర్‌ చెరువులు గుర్తించి పనులు చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో 0.50 సెంట్ల విస్తీర్ణంలో 400 క్యూబిక్‌ మీటర్ల క్వాంటిటీతో 50 కొత్త మినీ అమృత్‌ సరోవర్‌లు, పర్కులేషన్‌ ట్యాంకులు, పర్కులేషన్‌ చెరువులను గుర్తించాలన్నారు. ప్రతి మండలానికి కనీసం 500 ఫారంపాండ్‌కుంటలు బండింగ్‌తోపాటుగా గుర్తించాలన్నారు. ప్రతి మండలంలో 200 ఎకరాల్లో పండ్ల తోటలు ఉండేలా చూడాలని, ఇందులో ఎస్సీ ఎస్టీలకు 50 శాతం వచ్చేలా చూడాలన్నారు. గుట్టలపై పచ్చదనం ఉండేలా ప్రతి మండలానికి ఒక గుట్టకు ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో కనీసం ఐదు చొప్పున పనులు చేపట్టాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు 50 శాతం తగ్గకుండా ప్రతి మండలంలో పశువుల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. ఆధార్‌ అనుసంధానంతో వేతన జీవులకు పేమెంట్‌ జరగాలన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన (డీఆర్‌డీఏ) సంస్థ కలిసి పనిచేస్తే ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేపట్టవచ్చని సూచించారు. అనంతరం ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు ఆయన మునగ మొక్కలను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల ఉపాధి హామి సిబ్బంది, కార్యక్రమ అధికారులు, అదనపు కార్యక్రమ అధికారులు, ఇంజనీరింగ్‌ కన్సెల్టెట్లు, జూనియర్‌ ఇంజనీర్లు, ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్లు, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు.

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ డైరెక్టర్‌ చిన్న తాతయ్య

Advertisement

తప్పక చదవండి

Advertisement