పోలీసులపై రాళ్లు విసిరిన యువకులు | Sakshi
Sakshi News home page

పోలీసులపై రాళ్లు విసిరిన యువకులు

Published Sun, Dec 10 2023 1:20 AM

-

ప్రొద్దుటూరు క్రైం : అర్థరాత్రి దాటిన తర్వాత స్కూటీలో వెళ్తున్న యువకులు పోలీసులపై రాళ్లను విసిరిన సంఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. నైట్‌ పెట్రోలింగ్‌లో భాగంగా వన్‌టౌన్‌ ఎస్‌ఐ హైమావతి శనివారం వేకువ జామున 1.30 గంటల సమయంలో బైపాస్‌ రోడ్డులోని రెండు కుళాయిలకు వెళ్లే దారిలో సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న పలువురిని పిలిచి ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తూ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో జమ్మలమడుగు వైపు నుంచి ఇద్దరు యువకులు స్కూటీలో వస్తున్నారు. వారి రాకను గమనించిన పోలీసులు ఆపాల్సిందిగా చెయ్యి చాచారు. పోలీసులను చూసిన యువకులు స్కూటీలో మరింత వేగంగా వెళ్లే క్రమంలో పోలీసుల చెయ్యి వారిలో ఒకరికి తగలింది. కొంత దూరం ముందుకు వెళ్లిన యువకులు తిరిగి స్కూటీలో వెనక్కి వచ్చి రాయి తీసుకొని పోలీసులపై విసరడంతో ఎస్‌ఐ హైమావతికి తగిలి మొబైల్‌ ఫోన్‌ పగిలిపోయింది. తర్వాత యువకులు స్కూటీని వేగంగా నడుపుకుంటూ పారిపోయారు. మొబైల్‌ ఫోన్‌ పగిలిన అద్దాలు గుచ్చుకోవడంతో ఎస్‌ఐకి కొద్దిపాటి గాయమైనట్లు తెలుస్తోంది. రాయి విసిరిన వారు ఆకతాయిలా లేక ఇసుక అక్రమ రవాణాదారులా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇద్దరు యువకుల కోసం ఐదు పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement