రైతుల ఇళ్ల వద్దే పశువులకు చికిత్స | Sakshi
Sakshi News home page

రైతుల ఇళ్ల వద్దే పశువులకు చికిత్స

Published Fri, Dec 15 2023 1:24 AM

1962 వాహనంలోని మందులను 
పరిశీలిస్తున్న రీజినల్‌ మేనేజర్‌ కలీమ్‌ 
 - Sakshi

ప్రొద్దుటూరు క్రైం : అత్యవసర సమయంలో రైతుల ఇంటి వద్దకు వెళ్లి డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల ద్వారా పశువులకు మెరుగైన చికిత్సను అందిస్తున్నామని జీవీకే సంస్థ రీజినల్‌ మేనేజర్‌ కలీమ్‌ తెలిపారు. 1962 వాహనాలను తనిఖీ చేసేందుకు గురువారం ఆయన ప్రొద్దుటూరుకు వచ్చారు. వాహనాలను తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇళ్ల వద్దనే మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను ప్రవేశ పెట్టిందన్నారు. అత్యవసర సమయంలో రైతులు 1962 నంబర్‌కు ఫోన్‌ చేయగానే తమ సిబ్బంది వెంటనే ఆయా గ్రామాలకు చేరుకొని రైతుల కళ్ల ముందే వారి పశువులకు ఉచితంగా చికిత్సను అందిస్తారని చెప్పారు. చికిత్సతో పాటు మందులు కూడా రైతులకు ఇస్తారని తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో 14 వాహనాలు

ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో 1962 అంబులెన్స్‌లు 14 ఉన్నట్లు రీజినల్‌ మేనేజర్‌ కలీమ్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 340 వాహనాలు ఉన్నాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున ఉన్నాయని చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు రైతులకు ఈ సేవలను అందిస్తామన్నారు. 1962 వాహనం ద్వారా ప్రతి రోజు ఒక్కో నియోజకవర్గంలో 8– 10 కేసులు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. చికిత్స అనంతరం కాల్‌ సెంటర్‌ సిబ్బంది రైతులకు ఫోన్‌ చేసి పశువుల స్థితిగతులను తెలుసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్‌ అనిల్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో

14 డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార

పశు ఆరోగ్య సేవ వాహనాలు

వాహనాలను తనిఖీ చేసిన

జీవీకే సంస్థ రీజినల్‌ మేనేజర్‌ కలీమ్‌

Advertisement
Advertisement