ఉచిత వైద్యానికి ఊపిరి | Sakshi
Sakshi News home page

ఉచిత వైద్యానికి ఊపిరి

Published Fri, Dec 15 2023 1:24 AM

 డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ జిల్లా కార్యాలయం  - Sakshi

ప్రభుత్వం ఎప్పటికప్పుడు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీని బలోపేతం చేస్తూ వస్తోంది. తాజాగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకానికి మరింత ఊపిరి పోశారు. పెద్ద జబ్బులకు సైతం ఒక పైసా ఖర్చు లేకుండా నిశ్చింతగా ఉచిత వైద్య సేవలను పొందేలా చర్యలు చేపట్టారు. పేదలు ఆర్ధికంగా చితికిపోకుండా ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది.

వైద్య వ్యయం ప్యాకేజీ రూ 25 లక్షలకు పెంపు

5.83 లక్షల కుటుంబాలకు కొత్త కార్డులు

18న ప్రారంభోత్సవం..20 నుంచి ఇంటింటికీ కార్డుల పంపిణీ

కడప రూరల్‌: దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్ద పీట వేసింది. ప్రధానంగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకంలో ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన మార్పులను తెచ్చి, పేదల ఆరోగ్యానికి అభయమిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ఆరోగ్య శ్రీ కింద వైద్యానికి అయ్యే వ్యయాన్ని ఏడాదికి ఒక కుటుంబానికి రూ 5 లక్షల వరకు ఉన్న ప్యాకేజీనీ రూ 25 లక్షలకు పెంచడం విశేషం. ఈ పెంపు వల్ల పథకంలో ఉన్న మొత్తం 2,325 వ్యాధులకు వర్తిస్తుంది. అలాగే సాధారణ రోగాలకే గాక ఖరీదైన..పెద్ద జబ్బులైన క్యాన్సర్‌ వ్యాధికి సంబంధించిన కీమో ధెరపీ, రేడియో ధెరపీ, కీడ్నీ తదితర వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఒక వేళ వర్తించే జబ్బుల చికిత్సలో వ్యయం ఎక్కువైనా కూడా మన చేతి నుంచి డబ్బులు చెల్లించకుండా అభ్యర్థన ద్వారా ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ నుంచి ప్రయోజనం పొందవచ్చు. కాగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగానికి సంబంధించిన ఆరోగ్య శ్రీ నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు మొత్తం 169 ఉన్నాయి.

కొత్త కార్డులు పంపిణీ...

ఆరోగ్య శ్రీ ద్వారా నేరుగా నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు వెళ్లి ఉచిత వైద్య సేవలను పొందడానికి కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ప్రకారం ఒక కుటుంబానికి ఒక కార్డును మంజూరు చేస్తారు. జిల్లాలో 5.83 లక్షల కుటుంబాకు కొత్తగా రూపొందించిన డిజిటల్‌ కార్డులను అందజేస్తారు. అంటే ఒక కార్డులో ఉదాహరణకు ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉంటే దాదాపు 17 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరనుందని అంచనా..ఇందుకు సంబంధించి ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభోత్సవం చేస్తారు. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా ఒక నియోజక వర్గంలోని ఒక సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు.. 20వ తేదీ నుంచి స్థానిక ఏఎన్‌ఎం, సీహెచ్‌ఓల ద్వారా ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారికి కార్డులను అందజేయడానికి చర్యలు చేపట్టారు..

టీడీపీ పాలనలో అస్తవ్యస్త్యం...

2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో లక్షలాది మంది ఉచితంగా వైద్య సేవలు పొంది..పునర్జన్మ పొందారు. చంద్రబాబునాయుడి పాలనలో ఈ పథకం నిలువెల్లా అస్తవ్యస్తంగా సాగింది.అనంతరం ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు.

‘ఆరోగ్య శ్రీ’ప్యాకేజీ పెంపు వివరాలు

ముఖ్యమంత్రులు ప్యాకేజీ (రూ.లక్షల్లో)

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2.50

చంద్రబాబునాయుడు 2.50

వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పాలన ప్రారంభంలో 5

తాజాగా 25

సచివాలయం ద్వారా కార్డును పొందవచ్చు

ఎవరికై నా సరే కార్డులు రాకున్నా, నిబంధనల ప్రకా రం అర్హులైన వారు ఉంటే స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే కొత్త కార్డులు పొందవచ్చు. అలాగే అర్హులైన వారికి కార్డు లేనప్పుడు ఎవరైనా ఆనారోగ్యానికి గురైతే సబంధింత ఆసుపత్రిలోని ఆరోగ్య మిత్ర డెస్క్‌ ద్వారా సీఎంసీఓకు ఒక లెటర్‌ను పెడితే జిల్లా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యాలయం ద్వారా ఉచిత చికిత్సకు అనుమతిని ఇవ్వడం జరుగుతుంది. – డాక్టర్‌ బాలాంజనేయులు,

జిల్లా కో ఆర్డినేటర్‌, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌

1/2

2/2

Advertisement
Advertisement