చంద్రబాబు ఫొటోను చెప్పులతో కొట్టిన రమేష్ రెడ్డి వర్గీయులు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఫొటోను చెప్పులతో కొట్టిన రమేష్ రెడ్డి వర్గీయులు

Published Sun, Feb 25 2024 1:34 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. ఆధినేత చంద్రబాబు ఫొటోను చెప్పులతో కొట్టారు. పార్టీ జెండాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. విధేయతను పరిగణలోకి తీసుకోకుండా అభ్యర్థులను ఎంపిక చేశారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే కొద్ది సీట్లు మాత్రమే ప్రకటించి, తక్కినవి పెండింగ్‌ పెట్టడంతో ఆయా సెగ్మెంట్లలో తెలుగుతమ్ముళ్ల మధ్య హైటెన్షన్‌ కొనసాగుతోంది.

► రాయచోటి టీడీపీ అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని ప్రకటించారు. చంద్రబాబు శుక్రవారం రాత్రి మాజీ ఎమ్మెల్యేలు రమేష్‌కుమార్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డిలకు ఫోన్‌ చేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆదేశించారు. చంద్రబాబు నిర్ణయానికి శుక్రవారం రాత్రే ప్రతిఘటన ప్రారంభమైంది. టీడీపీ జెండాలకు నిప్పు పెట్టి అర్ధరాత్రి వరకు నిరసన పాటించారు. శనివారం అభ్యర్థి ప్రకటనతో మరింత ఆజ్యం పోసినట్లయింది. ఒక్కమారుగా రమేష్‌కుమార్‌రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. చంద్రబాబు ఫొటోను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.

11 మంది క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, 44మంది యూనిట్‌ ఇన్‌చార్జిలు, 286 మంది బూత్‌ కమిటీ సభ్యులు, ఆరుగురు మండలశాఖ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు, 9 మంది సర్పంచ్‌లు రాజీనామాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ విషయాన్ని మాజీ జెడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కలాడీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు ప్రకటించారు. 25ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ, కష్టకాలంలో వెంట నడిచినా నిరుపయోగమే అయిందని వారు వెల్లడించారు. కాగా మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఆశలకు సైతం బ్రేకులు పడ్డాయి. అధిష్టానం నిర్ణయం కలవరపాటుకు గురిచేసినా మౌనం వహిస్తున్నారు.

కడప టీడీపీ అభ్యర్థిగా మాధవీరెడ్డి....
ఆరు నెలలు క్రితం వరకు అమె రాజకీయాలకు దూరం. సొంత కాంట్రాక్టు సంస్థ ఆర్కే ఇన్‌ఫ్రా పర్యవేక్షణలో ఉన్నారు. అనూహ్యంగా రాజకీయ అరంగ్రేటం చేసి కడప అసెంబ్లీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. అప్పటి వరకు అభ్యర్థిగా ఊరిస్తూ వచ్చిన ఉమాదేవి కుటుంబానికి చంద్రబాబు అండ్‌కో షాక్‌ ఇచ్చింది. రెండేళ్ల కిందట ఆలంఖాన్‌పల్లె లక్ష్మీరెడ్డి కుటుంబానికి టీడీపీ అధిష్టానం అభయం ఇవ్వడంతో తెరవెనుక ఎన్నికల గ్రౌండ్‌ దాదాపు పూర్తి చేశారు. అంతలోనే మాధవీరెడ్డి ప్రత్యక్షం కావడంతో డీలా పడ్డారు. కాగా నారా లోకేష్‌ మీ పని మీరు చేసుకోండి, ఉమాదేవి అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కాబట్టే మాధవీరెడ్డిని ఇన్‌చార్జిగా ప్రకటించినా పోటీగా కార్యక్రమాలు నిర్వహించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కార్పొరేటర్‌ ఉమాదేవి, మాజీ ఇన్‌చార్జి అమీర్‌బాబు, దుర్గాప్రసాద్‌ జట్టుగా ఏర్పడి పోటీ కార్యక్రమాలను కొనసాగించారు. ఉప్పు–నిప్పులా ఉన్న ఈ రెండు వర్గాలను ఏకతాటిపైకి తీసుకురాకుండానే మాధవీరెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయడంపై వైరిపక్షం తీవ్ర ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేస్తోంది.

తొలి జాబితాలో పుత్తాకు మొండిచేయి....
కమలాపురం టీడీపీ ఇన్‌చార్జిగా పుత్తానరసింహారెడ్డి పదహారేళ్లుగా ఉన్నారు.మూడు మార్లు టీడీపీ అభ్య ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఎన్నికల్లో తలపడాలని భావించి పార్టీ కార్యక్రమాలను చురుగ్గా కొనసాగిస్తున్నారు. కమలాపురం కేంద్రంగా రా...కదిలిరా..కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినా, ఆ సందర్భంగా చంద్రబాబు పుత్తా పేరు ఉచ్చరించకపోవడంతో తెలుగుతమ్ముళ్లు డైలమాలో పడ్డారు. ఈలోగా పుత్తా అభిప్రాయంతో నిమిత్తం లేకుండా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. తర్వాత ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌ కాల్స్‌లో వీరశివా అభ్యర్థిత్వంపై సర్వే నిర్వహించారు. ఇలాంటి తరుణంలో తొలిజాబితాలో పుత్తాకు టీడీపీ అధిష్టానం మొండిచేయి చూపడంతో అక్కడి శ్రేణుల్లో టెన్షన్‌ కొనసాగుతోంది.

ప్రొద్దుటూరులో కొనసాగుతున్న ఉత్కంఠ... 
ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌ను నలుగురు ఆశిస్తున్నారు. ఎవరికి వారు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి చంద్రబాబు ఆశీస్సులు లభించగా, ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి నారా లోకేష్‌ అభయమిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి సురేష్‌నాయుడు అభ్యర్థిత్వం కోసం సోదరుడు సీఎం రమేష్‌నాయుడు మంత్రాంగం కొనసాగిస్తున్నారు. ఈపరిస్థితుల్లో ప్రొద్దుటూరు స్థానం తొలి జాబితాలో లేదు. ఎవరూ లేనప్పుడు, సీనియర్లు ముఖం చాటేసిన సమయంలో పార్టీ జెండాను తన భుజస్కందాలపై వేసుకున్నానని ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రకటిస్తూ తన అభ్యర్థిత్వంపై ధీమా వ్యక్తం చేశారు. కాగా ఎక్కడికక్కడ ఆశావహుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుండటం గమనార్హం.

 మాధవిరెడ్డికి టికెట్‌ కేటాయింపు తప్పడునిర్ణయం  
కడప రూరల్‌: కడప నియోజకవర్గ టికెట్‌ మాధవిరెడ్డికి ఇవ్వడం పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని కడప నియోజకవర్గ టీడీపీ మాజీ ఇనాచార్జి  వీఎస్‌ అమీర్‌ బాబు, పార్టీ సీనియర్‌ నాయకులు ఆలంఖాన్‌పల్లె లక్ష్మీరెడ్డి,  దుర్గాప్రసాద్, సింగల్‌ విండో మాజీ అధ్యక్షుడు మన్మోహన్‌ రెడ్డిలు అభిప్రాయపడ్డారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ  కష్టకాలంలో పారీ్టకి వెంట నడిచిన వారిని విస్మరించి మాధవిరెడ్డికి టికెట్‌ కట్టబెట్టడంతో కార్యకర్తలు నిరాశగా ఉన్నారని వారు తెలిపారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement