Sakshi News home page

ముగిసిన ఎస్‌జీఎఫ్‌ ఫుట్‌బాల్‌ పోటీలు

Published Tue, Oct 10 2023 6:55 AM

Concluded SGF Football Competitions - Sakshi

కడప: స్థానిక జెడ్పీ హైస్కూల్‌ మైదానంలో మూడు రోజులుగా నిర్వహించిన 67వ ఎస్‌జీఎఫ్‌ అంతర్‌జిల్లాల ఫుట్‌బాల్‌(అండర్‌–19) పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన జట్లు పాల్గొన్నాయి. బాలికల విభాగంలో మొదటి స్థానంలో కడప, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో గుంటూరు, నాలుగో స్థానంలో విశాఖపట్నం నిలిచాయి.

హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో 2–1 స్కోర్‌తో అనంతపురంపై కడప జట్టు జయకేతనం ఎగురవేసింది. బాలుర విభాగంలో ప్రథమస్థానంలో అనంతపురం, ద్వితీయస్థానంలో గుంటూరు, మూడోస్థానంలో కడప, నాలుగోస్థానంలో చిత్తూరు నిలిచాయి. ఫైనల్స్‌లో 4–3 స్కోర్‌తో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు మదనపల్లె ఆర్డీఓ ఎం.ఎస్‌.మురళీ, ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య చేతుల మీదుగా కప్‌లు, మెడల్స్, జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వరదారెడి గారి నారదరెడ్డి ఫుట్‌బాల్‌ పోటీల నిర్వహణకు రూ.10,116, విజేతలుగా నిలిచిన కడప(బాలికలు), అనంతపురం(బాలురు) జట్టులకు ఒక్కొక్క జట్టుకు రూ.10,116 చొప్పున మొత్తం రూ.30,348 ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎం.ఎస్‌.మురళీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత మదనపల్లెలో తొలిసారిగా 67వ ఎస్‌జీఎఫ్‌ అంతరజిల్లాల ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య మాట్లాడుతూ 67వ అంతరజిల్లాల ఫుట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక చేశామన్నారు. వీరు రాష్ట్రం తరఫున జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకరరెడ్డి, రాజగోపాల్, ఏసీటీఓ నాగేంద్ర, హెచ్‌ఎం సుబ్బారెడ్డి, మహమ్మద్‌ఖాన్, పీఈటీలు అన్సర్, సుధాకర్, రమేష్, నాగరాజు, కరుణానిధి, 13 జిల్లాల జట్ల మేనేజర్‌లు, కోచ్‌లు పాల్గొన్నారు. 

అండర్‌–19 జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక 

ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య తెలిపారు. సెలక్షన్‌ కమిటీ సభ్యులుగా ఉదయ్‌భాస్కర్, శ్రీనివాసులు, రమేష్‌ వ్యవహరించారు. జాతీయస్థాయి జట్టుకు ఎంపికైన బాలురు ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్‌ 4 వరకు జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో, బాలికలు నవంబర్‌లో పంజాబ్‌లో జరిగే జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు.

బాలికలజట్టు: ఎస్‌.భానుశ్రీ, కె.మనీషా, ఆర్‌.భువన, ఎం.సావిత్రి(కడప), పి.కావ్యశ్రీ, యు.హారిక, కె.మమత(అనంతపురం), ఎం.పవిత్రపావని, ఎం.జ్యోతి, పి.టి.వి.హరిప్రియ(గుంటూరు), పి.సులోచన, జి.హేమహాసిని(వైజాగ్‌), పి.సుహర్ష, ఏ.బెహ్హప్‌మన్‌ జున్నా(కృష్ణా), కె.పావని(చిత్తూరు), జి.కావేరి(ప్రకాశం), ఎం.శిరీషా(నెల్లూరు), వి.సత్యసౌమ్య(ఈస్ట్‌గోదావరి) రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. స్టాండ్‌బైలుగా కె.జొన్నాప్రహర్షిత(కృష్ణ), ఎం.వెంకటసుప్రజ (కడప), ఎల్‌.గాయత్రి(విజయనగరం), వి.ప్రజ్ఞారమణ(కర్నూలు), జీవిత(నెల్లూరు).

బాలుర జట్టు: ఆసిఫ్, ఎ.నందకిశోర్, భరత్, జి.నరేంద్ర(అనంతపురం), జి.కౌశిక్‌, ఎస్‌.డి.రవూఫ్, ఎస్‌.కె.నాగషరీఫ్‌(గుంటూరు), సీతుమాధవ్, పి.విఘ్నేష్‌(కడప), సుఫియాన్, సి.అరవింద్‌(చిత్తూరు), జె.మైఖేల్‌(ప్రకాశం), అభి(కర్నూలు), వైడియస్‌ అశ్వథ్‌(వైజాగ్‌), జే.రాముడు(కృష్ణ), కెల్విన్‌కెన్నెట్‌(చిత్తూరు), వై.కల్యాణ్‌(విజయవాడ), కె.అశోక్‌కుమార్‌(నెల్లూరు) స్టాండ్‌బైలుగా అఖిల్‌యాదవ్‌(చిత్తూరు), వి.విజయ్‌(గుంటూరు), డి.వీరబాబు(ఈస్ట్‌గోదావరి), టి.రోహిత్‌.శ్రీ.ఫణిధర్‌(వెస్ట్‌గోదావరి), జ్ఞానేశ్వర్‌(శ్రీకాకుళం). 

Advertisement

What’s your opinion

Advertisement