రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

Published Sat, Jul 27 2013 10:35 AM

రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు శనివారం ప్రారంభమైనాయి. ఈ విడతలో 6,971 పంచాయతీలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. ఎన్నికల కౌంటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. సాయంత్రానికి ఫలితాలు వెల్లడవుతాయి. కాగా రెండో విడతలో 7,738 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఏకగ్రీవాలు, వరదల వల్ల ఎన్నికలు వాయిదా పడ్డవి, నామినేషన్లు దాఖలు కానివి, అభ్యర్థులు చనిపోయి కారణంగా వాయిదా పడ్డవి మొత్తం 1,001 పంచాయతీలకు ఎన్నికలు జరగడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ నిన్న సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ 6,971 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. కానీ, వాస్తవానికి విశాఖపట్టణం డివిజన్‌లో 108 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పొరపాటుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 275ను పంచాయతీలుగా ఎన్నికల సంఘం పేర్కొంది. నెల్లూరులో ఏకగ్రీవమైన 55 పంచాయతీలతోపాటు నామినేషన్లు దాఖలు కాని రెండు పంచాయతీలను కూడా కలిపి మొత్తం 234 పంచాయతీలుగా చూపింది. దీంతో ఎన్నికలు జరిగే పంచాయతీల సంఖ్య పెరిగింది. వాస్తవానికి ఎన్నికలు జరిగే పంచాయతీలు 6,737 మాత్రమేనని ఆ తరువాత ఎన్నికల సంఘం అధికారి ఒకరు వివరించారు.

Advertisement
Advertisement