ఫీజుకూ ఆధార్ గండం | Sakshi
Sakshi News home page

ఫీజుకూ ఆధార్ గండం

Published Mon, Sep 16 2013 10:14 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి పెను గండం పొంచి ఉంది. ఆధార్ యూనిక్ ఐడెంటిటీ నంబర్ (యూఐడీ) ఉంటేనే ఫీజుల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్న నిబంధన ఈ ఏడాది సగానికి సగ ం మంది విద్యార్థుల కొంప ముంచనుంది. రాష్ట్రంలో 12 జిల్లాల్లోనే ప్రారంభమైన నగదు బదిలీ కోసం జారీ చేసిన ఆధార్ నిబంధనను 23 జిల్లాల్లోనూ ఫీజుల పథకానికి ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఈ పథకం నుంచి పేద విద్యార్థులను తప్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలా అసంబద్ధమైన చర్యకు దిగినట్టు కన్పిస్తోందంటున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఆధార్ నమోదుల సంఖ్య 50 శాతానికి అటు ఇటుగా ఉన్న విషయం తెలిసిందే. అది కూడా ఏడెనిమిది పైలట్ జిల్లాల్లోనే అత్యధికంగా నమోదైంది. అలాంటి ఆధార్‌ను ఫీజు పథకానికి అన్ని జిల్లాల్లోనూ తప్పనిసరి చేయడంతో పేద విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు విద్యార్థులందరికీ ఆధార్ ఇప్పించడంలో అధికారుల నిర్లక్ష్యం లక్షలాది మంది విద్యార్థులు ఫీజుల పథకానికి దూరమమయ్యే ప్రమాదాన్ని తీసుకొచ్చింది. 40 రోజుల్లో 4 లక్షల దరఖాస్తులే: ఏటా 25 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫీజుల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కానీ ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్యను ‘ఆధార్’ మాత్రమే నిర్ణయించనుంది. ‘ఇ-పాస్’ వెబ్‌సైట్‌లో పదో తరగతి వివరాలతో పాటు ఆధార్ యూఐడీ సంఖ్య, మొబైల్ నంబర్ నమోదు చేస్తే పాస్‌వర్డ్ వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తేనే దరఖాస్తు కనిపిస్తోంది. అంటే ఆధార్ సంఖ్య లేని విద్యార్థులకు దరఖాస్తే కనిపించదు. ఈ ఏడాది దరఖాస్తు చేసేందుకు ఇ-పాస్ వెబ్‌సైట్ ద్వారా అనుమతినిచ్చి 40 రోజు లు గడుస్తున్నా ఇప్పటిదాకా 4.8 లక్షల దరఖాస్తులే వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో ఇవి 20 శాతం లోపే. మిగతా 80 శాతం మంది సెప్టెంబర్‌లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇంత తక్కువ కాలంలో అదెలా సాధ్యం? చేసుకున్నా ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించేదెప్పుడు? వారికి ట్యూషన్ ఫీజు, స్కాలర్‌షిప్ మంజూరు చేసేదెప్పుడు? ..మరోవైపు మొత్తం విద్యార్థుల్లో 10-12 లక్షల మందికి మాత్రమే ఆధార్ యూఐడీ వచ్చింది. వీరిలో పైలట్ జిల్లాలుగా ఎంపికైన 12 జిల్లాల్లో దాదాపు 60 శాతం ఉండగా, మిగిలిన 11 జిల్లాల్లో 40శాతం మంది ఉన్నారు. దాదాపు 8 లక్షల మంది అసలు నమోదు చేసుకోలేదు. కొత్తగా నమోదు చేసుకునే వారికి ఆధార్ రావాలంటే ప్రస్తుత పరిస్థితులో మూడునెలలైనా పడుతుంది. ఈ నేపథ్యంలో లక్షలాది విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ డోలాయమానంలో పడింది. చేయాల్సింది చేయకుండా..: విద్యార్థులకు ఆధార్ ఇప్పించడంలో సంక్షేమ శాఖలు, కళాశాలల యాజమాన్యాలు, ఆధార్ విభాగాల మధ్య సమన్వయం లోపించింది. దాంతో ఆధార్ కార్డులు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కాలేజీలవారీగా ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి నాలుగు నెలలవుతున్నా ఒక్క కాలేజీలో కూడా అందుకు ఏర్పాట్లు జరగలేదు. అసలు ఆధార్ కార్డులు అందరికీ రాకుండానే, విద్యార్థులు దరఖాస్తు చేసుకోకుండానే ఉన్నతాధికారులు ఫీజుల పథకంలో పలు వ్యవస్థలను ప్రవేశపెడుతున్నారు. ఆధార్ పేమెంట్ బ్రిడ్జి , రిమోట్ ఆధార్ ఫ్రేమ్‌వర్క్ అంటూ స్కాలర్‌షిప్ మంజూరు, దరఖాస్తుల పరిశీలన కోసం మార్గదర్శకాలు రూపొందించుకున్నారు. ఆర్‌ఏఎఫ్ ద్వారా విద్యార్థి సమర్పించిన ఆధార్ కార్డుల వివరాలను, పదో తరగతి సర్టిఫికెట్‌పై ఉన్న వివరాలను ఫొటోతో సహా సరిచూడాలని, ఏ మాత్రం తేడా ఉన్నా స్కాలర్‌షిప్‌ను పెండింగ్‌లో పెట్టాలని చెబుతున్నారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒక్కదాన్నీ పరిష్కరించడం లేదు. ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) విధానం ద్వారా విద్యార్థి మొబైల్‌కు వచ్చే పాస్‌వర్డ్‌ను ఇ-పాస్‌వెబ్‌సైట్‌లో నమోదు చేస్తేనే దరఖాస్తు కనిపిస్తుంది. ఆధార్ యూఐడీ సంఖ్య ఉన్న విద్యార్థులు ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తే ఇ-పాస్‌వర్డ్ రావడం లేదు. దాంతో ఆధార్ వచ్చినందుకు సంతోషించాలో, పాస్‌వర్డ్ రానందుకు బాధపడాలో అర్థం కాక విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారు. ఈ సమస్య 10 రోజులుగా ఉన్నా పట్టించుకోని అధికారులు, పాస్‌వర్డ్ రాకపోతే ‘మీసేవ’ కేంద్రాలకు వెళ్లి పాస్‌వర్డ్ లేకుండానే దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు చెబుతున్నారు. తీరా అక్కడికెళ్తే రూ.50 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. దానికి కూడా విద్యార్థులను మూడు, నాలుగు రోజులు తిప్పుకుంటున్నారు.

Advertisement
Advertisement