జిల్లాకో విమానాశ్రయం | Sakshi
Sakshi News home page

జిల్లాకో విమానాశ్రయం

Published Fri, Jan 13 2017 7:17 AM

విజయవాడ (గన్నవరం) విమానాశ్రయానికి ‘ఎన్‌టీఆర్‌ అమరావతి ఎయిర్‌ పోర్ట్‌’ పేరు పెట్టి, దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గురువారం విజయవాడ ఎయిర్‌పోర్టులో కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను ప్రారంభించడంతో పాటు రూ.150 కోట్లతో రన్‌వే విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయి టెర్మినల్‌ను రెండేళ్లలో పూర్తి చేయాలని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజును కోరారు. జిల్లాకో ఎయిర్‌పోర్టు తమ లక్ష్యమన్నారు. రాష్ట్రానికి మూడు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు రానున్నాయని, ఒకటి నెల్లూరు జిల్లా కావలికి సమీపంలో ఉన్న దగదర్తి వద్ద ఏర్పాటు చేయాలని ప్రాధమికంగా అనుకున్నామని, కానీ వాణిజ్య అవకాశాలు దృష్ట్యా దీన్ని కృష్ణపట్నంకు మార్చాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ప్రారంభించినది తాత్కాలిక టెర్మినల్‌ కాదని, పూర్తిస్థాయి టెర్మినల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత దీన్ని కార్గో అవసరాల కోసం ట్రాన్సిస్ట్‌ టెర్మినల్‌గా ఉపయోగించుకోనున్నట్లు అశోక్‌ గజపతి రాజు తెలిపారు. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కోసం కృషి చేస్తానని చెప్పారు.

Advertisement
Advertisement