ఆందోళనకరంగా కీటోన్స్ స్ధాయి | Sakshi
Sakshi News home page

ఆందోళనకరంగా కీటోన్స్ స్ధాయి

Published Fri, Oct 11 2013 8:55 AM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెను వెంటనే రెండుసార్లు నిరాహార దీక్ష చేపట్టడంతో అది ఆయనఆరోగ్యంపై తీవ్ర దుష్ర్పభావం చూపిందని నిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని పోలీసులు బుధవారం అర్ధరాత్రి బలవంతంగా నిమ్స్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మీడియాతో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి నెల రోజుల కిందట దీక్ష చేసినప్పుడే కీ టోన్స్(గ్లూకోజ్ నిల్వలు తగ్గి, కొవ్వులు శక్తిరూపంలో వినియోగమవుతున్నప్పుడు విడుదలయ్యే చెడు పదార్థాలు) ఎక్కువగా ఉన్నాయని, తిరిగి నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ దీక్ష చేయడం, అదే స్థాయిలో కీటోన్స్ విడుదల కావడం శరీరంపై తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. ప్రస్తుతం కీటోన్స్ అధికంగా ఉన్నాయని(బుధవారం రాత్రి నిమ్స్‌కు వచ్చే సమయానికి కీటోన్స్ 4 ప్లస్‌గా ఉన్నాయి) అవి తగ్గడానికి సమయం పడుతుందని అన్నారు. పళ్లరసాలు తీసుకోవాలని సూచన.. వైద్య పరీక్షల అనంతరం సుగర్ లెవల్ 113కు పెరిగిందని, (నిమ్స్‌కు తీసుకొచ్చే సమయానికి సుగర్ లెవల్ 54గా ఉంది) సాధారణ స్థాయికి చేరుకునేందుకు మరికొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతానికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని, ఇంకా ఆయన ఎలాంటి ఆహారమూ తీసుకోవడం లేదని, పళ్లరసాలు తదితరం ఏవైనా (ఓరల్ ఫ్లూయిడ్స్) తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. తిరిగి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, త్వరగా కోలుకునేందుకు తాము కృషి చేస్తున్నామని వైద్య బృందం పేర్కొంది. ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వలన మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉందని ఓ వైద్యుడు పేర్కొన్నారు. శ్వాస తీసుకోవడం, పల్స్ రేటు, రక్తపోటు తదితరాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు తెలిపారు. పదే పదే కీటోన్స్ శరీరంలో విడుదల అవుతుండటం భవిష్యత్‌లో శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని సీనియర్ వైద్యులొకరు ‘సాక్షి’తో అన్నారు. ప్రస్తుతం నిమ్స్ వైద్యులు డా. ఎం.నాగేశ్వరరావు(జనరల్ మెడిసిన్), డా.శేషగిరిరావు(కార్డియాలజీ), డా.గంగాధర్(నెఫ్రాలజీ), డా.లక్ష్మీభాస్కర్ తదితరులు జగన్‌మోహన్‌రెడ్డిని పర్యవేక్షిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకే డిశ్చార్జి: వైఎస్ భారతి వైద్య పరీక్షల ఫలితాలు, వైద్యుల నిర్ణయం తర్వాతే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని డిశ్చార్జి చేస్తారని ఆయన సతీమణి వైఎస్ భారతి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రిలో గురువారం జగన్‌ను భారతి పరామర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన పలు జాతీయ టీవీచానళ్ల ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. ‘‘దీక్ష భగ్నం సమయంలో కీటోన్ బాడీస్ అత్యంత ఉన్నతస్థాయికి చేరాయి. రక్తంలో చక్కెర స్థాయి 50కి పడిపోయింది. అనంతరం వైద్యులు జగన్‌కు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన నుంచి రక్తం నమూనాలు సేకరించారు. ఈ ఫలితాల వచ్చిన తర్వాత రేపు(శుక్రవారం) ఉదయం డిశ్చార్జిపై నిర్ణయం ఉంటుంది’’ అని ఆమె తెలిపారు.

Advertisement
Advertisement