సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ

Published Tue, Aug 6 2013 3:34 PM

సమైక్య సెగ ఇప్పుడు రాష్ట్ర రాజధానికి కూడా తాకింది. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధ నీటి పారుదల కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు.. తెలంగాణ ఉద్యోగులు మధ్య మంగళవారం తోపులాట జరిగింది. దాంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. భోజన విరామ సమయంలో ఏపీ ఎన్‌జీవో ఉద్యోగులు విభజనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రామాన్ని చేపట్టారు. సమైక్య నినాదాలు చేస్తున్నారు. అదే సమయంలో టీ ఎన్‌జీవో ఉద్యోగులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి ఉత్సవాలను ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఇటు సీమాంధ్ర ఉద్యోగులు.. అటు తెలంగాణ ఉద్యోగులు హోరా హోరిగా నినాదాలు చేశారు. ఒకవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఏపీ ఎన్జీవోలు నిరసన ప్రారంభించగా టీఎన్జీవోలు వారితో ఘర్షణ పడ్డారు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వివాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరికి వారే అన్నట్లు గట్టిగా పట్టుబట్టడంతో వివాదం మరింత ముదిరింది. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట మొదలైంది. ఈ విషయం తెలిసిన ఇతర విభాగాల ఉద్యోగులు భారీ ఎత్తున జలసౌధకు చేరుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు ప్రాంతాల ఉద్యోగులను శాంతింపజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్‌ చేస్తున్న సెక్రటేరియట్‌ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల ఆందోళనలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌ రెడ్డి, గొల్ల బాబురావు, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజలకు హైదరాబాద్‌ చెందదని... ఉన్నపళంగా హైదరాబాద్‌ వదలివెళ్లాలనడనం దుర్మార్గమని రాజమోహన్‌ రెడ్డి అన్నారు.