‘పెద్ద’పులి గూడేనికొచ్చింది! | Sakshi
Sakshi News home page

‘పెద్ద’పులి గూడేనికొచ్చింది!

Published Sat, Jul 18 2015 8:46 AM

ఒక పెద్దపులి వయోభారంతో జంతువులను వేటాడలేక జనారణ్యంలోకి వచ్చింది. చివరకు అటవీశాఖ అధికారులకు దొరికింది. సంరక్షించడానికి వీలుగా అధికారులు దాన్ని తిరుపతి జూకు తరలించారు. ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని నాగలూటి చెంచుగూడెం పరిసరాల్లో రెండు రోజులుగా కనిపిస్తున్న పులి శుక్రవారం వెంకటాపురం గ్రామ పొలాల్లో పట్టుబడింది. పులికి మత్తుమందును ఇచ్చి అటవీ శాఖ అధికారులు బంధించారు. అనంతరం సెలైన్ ఎక్కించి దాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షించారు. ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పట్టుబడిన ఆడ పెద్దపులి వయస్సు 16 సంవత్సరాలని నెహ్రూ జూపార్క్ కన్సల్టెంట్ డాక్టర్ సునీల్ తెలిపారు. అడవుల్లో సంచరించే పులులు 16 సంవత్సరాలు జీవించడం అరుదన్నారు. పట్టుబడిన పులి పూర్తి వృద్ధాప్యంలో ఉందని.. దాదాపు జీవిత చరమాంకమన్నారు. అందువల్లనే అది సులభంగా దొరికిందని చెప్పారు.