తొలిరోజే దద్దరిల్లిన రాజ్యసభ | Sakshi
Sakshi News home page

తొలిరోజే దద్దరిల్లిన రాజ్యసభ

Published Tue, Jul 21 2015 12:09 PM

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభం రోజే విపక్షాల ఆగ్రహ జ్వాలల్లో పడ్డాయి. కొన్ని తీర్మానాల తర్వాత లోక్ సభ వాయిదా పడగా.. రాజ్యసభలో మాత్రం లలిత్ మోదీ వీసా వ్యవహారం దుమారం రేపింది. రాజ్యసభను దద్దరిల్లేలా చేసింది. విపక్షాలన్నీ స్పీకర్ పోడియం చుట్టుముట్టేందుకు ప్రయత్నించాయి. ప్లకార్డులు, పోస్టర్లతో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. లలత్ మోదీపై ఎఫ్ఐఆర్ దాఖలైందని, ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు అందుకున్నారని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆనంద్ శర్మ లలిత్ మోదీ వ్యవహారాన్ని లేవనెత్తారు. లలిత్ మోదీ కుంభకోణాన్ని తొలిసారి గుర్తించింది ఇంగ్లాండ్ అని చెప్పారు. భార్య అనారోగ్యం పేరిట లలిత్ మోదీ విదేశాల్లో తిరుగుతున్నారని, రెడ్ కార్నర్ నోటీసులు ఉన్న ఓ వ్యక్తిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయడం లేదని, అక్కడ నుంచి భారత్కు ఎందుకు రప్పించడం లేదని నిలదీశారు. పది నెలలు గడుస్తున్నా లలిత్ మోదీని అరెస్టు చేయకపోవడానికి కారణాలేమిటో ప్రధాని చెప్పాలని ప్రశ్నించారు. ఆయన విదేశాలకు వెళ్లేందుకు మీ పార్టీ నేతలు సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహకరించినా వారిపై ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ప్రభుత్వాలు మారుతుండొచ్చుగానీ, చట్టాలు మారవు కదా అని ప్రశ్నించారు. లలిత్ మోదీకి కావాలనే ఎన్డీయే సర్కార్ పరోక్షంగా సహకరిస్తోందని అని ఆనంద్ శర్మ ఆరోపించారు. దీనికి తోడు కాంగ్రెస్ నేతలు వీహెచ్లాంటివారు కూడా ఎన్డీయేపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లలిత్ మోదీ వ్యవహారంపై చర్చించాలని, ఆయనను అరెస్టు చేయాలని, లలిత్ కు సహకరించిన నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్తో తమ ఎదురుగా ఉన్న బల్లలు చరుస్తూ కేకలు వేశారు. దీంతో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కలగజేసుకున్నారు. లలిత్ మోదీ వీసా వివాదంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెప్పారు. తమ నేతలెవరూ ఏ తప్పూ చేయలేదని ఆయన చెప్పే యత్నం చేసినా వినకపోవడంతో రాజ్యసభ 12గంటల వరకు వాయిదా పడింది.

Advertisement
Advertisement