తెలంగాణకు గడువు లేదు: దిగ్విజయ్ | Sakshi
Sakshi News home page

తెలంగాణకు గడువు లేదు: దిగ్విజయ్

Published Mon, Jul 1 2013 6:52 PM

తెలంగాణ అంశం తుది దశకు చేరుకుందని, అయితే దానికి తుది గడువు ఏదీలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. గాంధీభవన్ ఆయన పిసిసి సమన్వయ సంఘంతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అంశంపై రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిగాయి. తుదినిర్ణయం కోసం కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. ఎవరికి వారు వేర్వేరు నివేదికలు సమర్పిచాల్సిందిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడిని కోరినట్లు తెలిపారు. అంతిమ నిర్ణయం తీసుకున్నతరువాత ఏం చేయాలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు చర్చిస్తారని చెప్పారు. తెలంగాణకు సంబంధించి రెండు ఆప్షన్లు పరిశీలిస్తున్నాం. ఒకటి సమైక్యాంధ్ర, రెండోది తెలంగాణ - ఈ రెండు ఆప్షన్లతో రోడ్ మ్యాప్ తయారుచేయమని చెప్పినట్లు తెలిపారు. రాజకీయ, పరిపాలనా కోణంలో రోడ్ మ్యాప్ ఉంటుందన్నారు. కేంద్ర నిర్ణయానికి రాష్ట్ర కాంగ్రెస్ కట్టుబడిఉంటుందని చెప్పారు. రెండో ఎస్ఆర్సి అనేది 2004 ఎన్నికల హామీ అని, దురదృష్టవశాత్తూ దాన్ని అమలు చేయలేకపోయామన్నారు. అన్ని అంశాలనూ సమగ్రంగా పరిశీలించిన తరువాతే కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యానే రాష్ట్ర విభజన ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు 2014 అనే రాజకీయ సవాల్ ఉందని చెప్పారు. దివంగత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. పార్టీ రహితంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై నిర్వహిస్తారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఏఐసిసి ఉపాధ్యక్షుడు అయిన తరువాత మూడు నెలలకొకసారి పార్టీ పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. బ్లాక్ స్థాయి నుంచి ఏఐసిసి వరకు పరిస్థితులను సమీక్షిస్తున్నారన్నారు. ప్రతి జిల్లాలో పార్టీ సమన్వయ సంఘాలు ఏర్పాటుచేస్తామని చెప్పారు.