నో సర్‌ప్రైజ్‌ : ఎక్కడ రేట్లు అక్కడే | Sakshi
Sakshi News home page

నో సర్‌ప్రైజ్‌ : ఎక్కడ రేట్లు అక్కడే

Published Wed, Oct 4 2017 2:49 PM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెండు రోజుల నాల్గవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ప్రకటించింది. ఈ ప్రకటనలో మెజార్టీ విశ్లేషకులు అంచనావేసిన మాదిరిగానే కీలకవడ్డీరేటు రెపోను యథాతథంగా ఉంచుతున్నట్టు గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ తెలిపింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. అదేవిధంగా రివర్స్‌ రెపో రేటును కూడా యథాతథంగా 5.75 శాతంగానే ఉంచింది. కేవలం స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను(ఎస్‌ఎల్‌ఆర్‌) మాత్రమే 50 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. రేట్లను తగ్గిస్తే ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చన్న ఆందోళనలూ నెలకొనడంతో ఆర్‌బీఐ, మెజార్టీ విశ్లేషకులు అంచనాల మేరకే పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. మందగమనంలో ఉన్న వృద్ధికి ఊతం ఇవ్వడానికి రెపో రేటుకు కోత పెట్టాలని ఇటు పారిశ్రామిక వర్గాలు కోరుకొనగా.. రేటు తగ్గింపు ద్వారా తమకు ఆర్‌బీఐ నుంచి స్నేహహస్తం అందుతుందని అటు ప్రభుత్వ వర్గాలు ఆశించాయి. కానీ వారి ఆశలను ఆర్బీఐ అడియాసలు చేసింది.