కేరళ వరదలు: ఏఆర్‌ రెహమాన్‌ పాడిన పాట! | Sakshi
Sakshi News home page

కేరళ వరదలు: ఏఆర్‌ రెహమాన్‌ పాడిన పాట!

Published Tue, Aug 21 2018 1:26 PM

కేరళను ముంచెత్తిన వరదల వల్ల అపార ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడంతో బాధితులను ఆదుకునేందుకు ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి, దేశంలోని నలుమూలల నుంచి విశాల హృదయులు తమ శక్తి మేరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక నటులు, కళాకారులు, సెలబ్రిటీలు, సంగీత సామ్రాట్లు తమదైన శైలిలో బాధితులను ఊరడిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లి అక్కడ తన సంగీత కచేరీని నిర్వహించారు. రెహమాన్‌ తాను సంగీతం సమకూర్చిన ‘ప్రేమ దేశం (కాదల్‌ దేశం)’ చిత్రంలోని ‘ముస్తఫా ముస్తఫా డోంట్‌ వర్రీ ముస్తఫా’ పాటను ఆయన స్టేజ్‌పైన పడాల్సి ఉంది. అయితే కేరళను భారీ వరదలు ముంచెత్తుతున్నాయని తెల్సి బాధితుల్లో స్థైర్యాన్ని నింపడం కోసం ఆయన వారికి సంఘీభావంగా పాట పల్లవిలోని మాటలను కొద్దిగా మార్చి ‘కేరళ కేరళ డోంట్‌ వర్రీ కేరళ’ అంటూ ఆయన పాడారు. దానికి ప్రేక్షకుల నుంచి కూడా భారీ స్పందన లభించింది. వారిలో ఒకరు ఆయన పాడిన పాట పల్లవి వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో ఇప్పుడది వైరల్‌ అవుతోంది. అనంతరం రెహమాన్‌ కేరళ బాధితులను ధైర్యంగా ఉండాలంటూ, కేరళను ఆదుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ రెండు వేర్వేరు ట్వీట్లు చేశారు. 

Advertisement
Advertisement