స్టార్‌ క్యాంపెయినర్స్‌ ఎవరు? వాళ్ల ఖర్చెవరు భరిస్తారు? | Sakshi
Sakshi News home page

స్టార్‌ క్యాంపెయినర్స్‌ ఎవరు? వాళ్ల ఖర్చెవరు భరిస్తారు?

Published Tue, Apr 2 2024 1:08 PM

Who is Star Campaigner and Their Significance in Electoral Outcomes

2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశకు మూడు వారాల కంటే తక్కువ సమయం ఉండడంతో ఎన్నికల ఫీవర్ ముదిరిపోతోంది. ఎవరికివారు పెద్ద ఎత్తున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు సాధారణ అభ్యర్థుల జాబితాను మాత్రమే కాకుండా.. స్టార్ క్యాంపెయినర్ల పేర్లను విడుదల చేయడం ప్రారంభించాయి. ఇంతకీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్స్ ఎందుకు? వారికయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

స్టార్‌ క్యాంపెయినర్స్‌ ఎవరు?
'స్టార్ క్యాంపెయినర్' ఎన్నికల సమయంలో పోటీ చేయడానికి లేదా ప్రచారం చేయడానికి రాజకీయ పార్టీ ఎంపిక చేసే వ్యక్తి. స్టార్ క్యాంపెయినర్‌కు ప్రజల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. కేవలం సినీ నటులు మాత్రమే క్యాంపెయినర్‌లుగా పనిచేయాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు కూడా ప్రచారకర్తలుగా ఉంటారు. స్టార్ క్యాంపెయినర్‌లను వారి పాపులారిటీ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబితాను భారత ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుంది.

బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ తరువాత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నేతలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యంత్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై.

అధికార బీజేపీని ఓడించడానికి కంకణం కట్టుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్స్ అంటే సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు ఉన్నారు. వీరితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్‌ సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌లుగా ప్రసిద్ధి.

ఖర్చు ఎవరు భరిస్తారు?
గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర పార్టీ గరిష్టంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్‌లను నామినేట్ చేయవచ్చు. కానీ గుర్తింపు లేని రాజకీయ పార్టీ గరిష్టంగా 20 మంది స్టార్ క్యాంపెయినర్లను మాత్రమే నామినేట్ చేయగలదు. ప్రచారకర్తలు పార్టీ గురించి మాట్లాడుతూ.. పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తారు. స్టార్ క్యాంపెయినర్ల ఖర్చులన్నింటినీ రాజకీయ పార్టీలు భరిస్తాయి.

ప్రధానమంత్రి లేదా మాజీ ప్రధాని స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నప్పుడు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో సహా భద్రతకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ప్రధాని వెంట మరో స్టార్ క్యాంపెయినర్ ఉంటే, భద్రతా ఏర్పాట్లలో అభ్యర్థి 50 శాతం ఖర్చు పెట్టాలి.