కృష్ణాలో వాటా పెంపే లక్ష్యంగా పోరాడనున్న రాష్ట్రం | Sakshi
Sakshi News home page

కృష్ణాలో వాటా పెంపే లక్ష్యంగా పోరాడనున్న రాష్ట్రం

Published Wed, Feb 14 2018 8:27 AM

కృష్ణా, గోదావరి నదీ బేసిన్‌ల పరిధిలో నెలకొన్న వివాదాలను కేంద్ర ప్రభుత్వం వద్దే తేల్చుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సిద్ధమయ్యాయి. నీటి వాటాలు, వినియోగం, కొత్త ప్రాజెక్టులు, ప్రస్తుత ప్రాజెక్టుల నియంత్రణ వంటి అంశాలపై కేంద్ర జలవనరులశాఖ గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో ఇరు రాష్ట్రాలు పరిష్కారం కోసం కృషి చేయనున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు చేతులెత్తేయడంతో చివరకు కేంద్రమే కదిలి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఈ భేటీ ఏర్పాటు చేసింది.

సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ అధికారులు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్‌సింగ్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం అధికారులతోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల అధికారులు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, టెలీమెట్రీ విధానం అమలు, నీటి వాటాల సర్దుబాటు, పట్టిసీమ,పోలవరంల కింది వాటాలు, నీటి పంపిణీ–నిర్వహణలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎజెండాలో చేర్చిన అంశాలపై ఇరు రాష్ట్రాలు మొదట తమ వాదన వినిపించిన అనంతరం..ఇతర అంశాలేవైనా ఉంటే వాటిపైనా వాదనలు జరిగే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement