పల్లెలపై సీసీ నిఘా | Sakshi
Sakshi News home page

పల్లెలపై సీసీ నిఘా

Published Sat, Feb 3 2018 6:03 PM

cctv cameras installed in village to create a safety and crime control - Sakshi

ఉట్నూర్‌(ఖానాపూర్‌) : నేరాల నియంత్రణ కోసం గ్రామ స్థాయి నుంచి చర్యలు చేపట్టేందుకు పొలీసుశాఖ సన్నాహాలు ప్రారంభించింది. గ్రామం మొదలుకొని మండల, జిల్లాస్థాయి వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘా పెంచేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే జిల్లా ఎస్పీలకు, కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామ అభివృద్ధి, పొలీసుశాఖ, వ్యాపారులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, జెడ్పీనిధులు నుంచి కొంత మొత్తం సేకరించి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు యోచిస్తున్నారు.

గ్రామస్థాయి నుంచి నిఘా...
గ్రామస్థాయిలో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా గ్రామాల్లో చోటు చేసుకోనే సంఘటనలు అందులో నిక్షిప్తం అవుతాయి. దాడులు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే పలు చోట్ల పోలీసు యంత్రాంగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నిఘా నేత్రాలను గ్రామానికి సంబంధించిన పోలీస్‌స్టేషన్‌లో కంట్రోల్‌రూంకు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. తద్వారా ఎమైనా సంఘటనలు చోటుచేసుకుంటే సత్వరం స్పందించే అవకాశం ఉంటుంది. అలాగే నేరస్తుల గుర్తింపు, కేసుల విచారణలో ఇవి దోహదపడుతాయి.

ప్రతి గ్రామంలో 5 నుంచి 10 సీసీ కెమెరాలు
పోలీసు శాఖ ఇప్పటికే మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తోంది. వీటి మాదిరిగానే గ్రామాల్లో సైతం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో 70 మండలాలు, 866 గ్రామపంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 1,756 రెవెన్యూ గ్రామాలు, 3,680 అనుసంధాన గ్రామాలతో పాటు 6,49,888 గృహ సముదాయాలు, 27,41,239 జనాభా ఉంది. ఈమేరకు ప్రతి గ్రామంలో 5 నుంచి 10 సీసీ కెమెరాలు, మండల కేంద్రాల్లో 30, పట్టణ ప్రాంతాల్లో 500, జిల్లా కేంద్రాల్లో 1000 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. గ్రామస్థాయిలో ఈ విధానం అమలు జరిగితే నేరాలు, దొంగతనాలు చాలావరకు అదుపులోకి వస్తాయని ప్రజలు అంటున్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement