Sakshi News home page

బాలుడి గొంతులో ఎముక తొలగింపు

Published Sat, Jan 27 2018 8:32 AM

ent doctors success on boy throat surgery - Sakshi

అనంతపురం న్యూసిటీ: బాలుడి గొంతులు ఇరుక్కున్న చికెన్‌ ముక్క (ఎముక)ను సర్వజనాస్పత్రి ఈఎన్‌టీ వైద్యులు ఆపరేషన్‌ చేసి బయటకు తీశారు. నల్లమడ మండలం రెడ్డిపల్లికి చెందిన నరేష్‌కుమార్, సంధ్య దంపతుల కుమారుడు ఐదేళ్ల వినయ్‌కుమార్‌ ఈ నెల 25వ తేదీన భోజనం చేసే సమయంలో చికెన్‌ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. నరకయాతన పడుతున్న బాలుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన కదిరి ఆస్పత్రి, అక్కడి నుంచి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.

ఆపరేషన్‌ విజయవంతం : సర్వజనాస్పత్రి వైద్యులు సకాలంలో స్పందించారు. గురువారం రాత్రంతా వారి పర్యవేక్షణలోనే ఉంచారు. శుక్రవారం ఉదయం ఈఎన్‌టీ హెచ్‌ఓడీ డాక్టర్‌ నవీద్‌అహ్మద్‌ నేతృత్వంలో వైద్యులు డాక్టర్‌ రాజేష్, డాక్టర్‌ అనూష, అనస్తీషియా వైద్యులు డాక్టర్‌ శ్రీహరిల బృందం అరగంట పాటు శ్రమించి ఈసోఫాగోస్కోపీ ద్వారా బాలుడి గొంతులో ఇరుక్కున్న ఎముకను తొలగించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, లేకపోతే ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారేదని హెచ్‌ఓడీ డాక్టర్‌ నవీద్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. ఎముకను తొలగించడంతో బాబు కుటుంబీకులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈఎన్‌టీ వైద్యులను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ అభినందించారు.

Advertisement

What’s your opinion

Advertisement