313వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

313వ రోజు పాదయాత్ర డైరీ

Published Thu, Dec 6 2018 3:58 AM

313th day padayatra diary - Sakshi

ఇప్పటి వరకు నడిచిన దూరం 3,390.3 కిలోమీటర్లు
05–12–2018, బుధవారం 
రెడ్డిపేట, శ్రీకాకుళం జిల్లా 

బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సంక్షేమం అరచేతిలో స్వర్గమేనా?!
ఈ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ధవళపేట వద్ద ప్రారంభమైన పాదయాత్ర పొందూరు వద్ద ఆమదాలవలస నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పొందూరు అనగానే ఖద్దరు గుర్తుకొస్తుంది. అది ఒక వృత్తి మాత్రమే కాదు.. ఓఅద్భుతమైన కళ. జాతిపిత మహాత్మాగాంధీ నుంచి.. ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ నేతల్ని ఆకట్టుకున్న ఘనత కలిగినది. నాన్నగారికి కూడా పొందూరు ఖద్దరంటే చాలా ఇష్టం. ఆ ఖద్దరు ఇప్పుడు కళ తప్పింది. పనికి తగ్గ ప్రతిఫలం లేకపోవడంతో ఎంతోమంది వృత్తిని మానేసి వలస బాట పడుతున్నారని ఉదయం కలిసిన ఖాదీ కార్మికులు చెప్పారు. కాసింతైనా ప్రోత్సాహం అందివ్వని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే.. ఆ కళ అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఈ ఆమదాలవలస.. కరణం మల్లీశ్వరిలాంటి ఎంతోమంది అంతర్జాతీయ మహిళా వెయిట్‌ లిఫ్టర్లను అందించిన ప్రాంతం. క్రీడా ప్రతిభకు కొదవే లేదు. ప్రభుత్వ ప్రోత్సాహమే కరువైంది. ఇదే విషయాన్ని ఈ రోజు నన్ను కలిసిన అన్మిష్‌వర్మ అనే సోదరుడు కూడా చెప్పాడు. ఈ యువకుడు అక్టోబర్‌లో ఏథెన్స్‌లో జరిగిన వరల్డ్‌ కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ గెలిచాడట. ప్రభుత్వం నుంచి ఏ కాస్త ప్రోత్సాహం ఉన్నా.. తనలాంటి ఎంతోమంది చాంపియన్లు తయారవుతారని చెప్పాడు.  

ఈ రోజు ఆనందాపురం, వాండ్రంగి, రాపాక.. ఇలా అన్ని చోట్లా ఎంతోమంది స్కూళ్లకు వెళ్లే విద్యార్థినులు కలిశారు. చాలా ఊళ్లకు రహదారులే లేవన్నారు. మొన్నటి పాలకొండ, నిన్నటి ఎచ్చెర్ల, నేటి ఆమదాలవలస.. ఎక్కడ చూసినా చాలా గ్రామాల రహదారులు అధ్వానంగా ఉన్నాయని చెబుతూనే ఉన్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు చెబుతోందీ ప్రభుత్వం. మరి ఆ నిధులన్నీ ఏమవుతున్నాయో.. ఎక్కడికి పోతున్నాయో! తమకు స్కాలర్‌షిప్పులు రావడం లేదని చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులు చెప్పారు. ఏ మూలకూ చాలదన్నట్టు.. వారికిచ్చేదే ఏడాదికి దాదాపు రూ.2 వేలు. అవి కూడా ఎగ్గొడితే ఏమనుకోవాలి?! ఏటా బడ్జెట్‌లో చూపెడుతున్న బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సంక్షేమం అరచేతిలో స్వర్గమేనా? రెల్లుగడ్డపై కోట్లాది రూపాయలతో కట్టిన చెక్‌ డ్యామ్‌ మూడు నెలలకే కొట్టుకుపోయిందని తాడివలస గ్రామస్తులు చెప్పారు. అధికార నేతల విచ్చలవిడి అవినీతికి ఇది నిదర్శనమన్నారు.  

నాన్నగారి హయాంలో నిధులు మంజూరవడంతో సగానికి పైగా మడ్డువలస ఫేజ్‌–2 విస్తరణ పనులు పూర్తయినా.. బాబుగారొచ్చాక మిగిలిన పనులు అటకెక్కాయని పొందూరు మండల రైతన్నలు చెప్పారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందకున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దురదృష్టకరం. మరోవైపు మడ్డువలస కుడి ప్రధాన కాలువకు నీరే రావడం లేదని జీసిగడాం రైతన్నలు చెప్పారు. నీరు–చెట్టు పేరుతో కోట్లు దోచేశారే తప్ప.. కాలువ లైనింగ్‌ పనులు, మరమ్మతులు చేయకపోవడమే దీనికి కారణమన్నారు. ఈ సర్కారు తీరు ఇలా ఉంటే.. రైతన్నలు వ్యవసాయాన్ని వదిలేసి ఇటుక బట్టీలు, కోళ్లఫారాల వైపు, వలసల వైపు మొగ్గు చూపక మరేం చేయగలరు? 

ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.. బలసలరేవు వంతెన. దాదాపు 80 గ్రామాలకు 40 కిలోమీటర్ల మేర దూరాభారాన్ని తగ్గిస్తుందని వంతెన సాధన సమితి సభ్యులు చెప్పారు. ఆ వంతెన గతంలో బాబుగారిచ్చిన హామీ. దాని కోసం ప్రజలు 650 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నారట. ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలక నేతల స్వార్థ ప్రయోజనాలే ఈ వంతెన నిర్మాణానికి అడ్డంకిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులందరికీ ప్రతినెలా ఠంచన్‌గా స్కాలర్‌షిప్పులు చెల్లిస్తానని గొప్పగా చెప్పారు. అది చేయకపోగా.. ఆ తర్వాత మూడు నెలలకోసారి ఇస్తామని అధికారులతో చెప్పించారు.. అదీ జరగలేదు. చాలామందికి సంవత్సరానికి కూడా ఇచ్చిన దాఖలాల్లేకపోవడం వాస్తవం కాదా? మీరు అధికారం చేపట్టాక అసలు స్కాలర్‌షిప్పే రాలేదంటున్న ఎంతోమంది పేద విద్యార్థులకు ఏం సమాధానంచెబుతారు? 
- వైఎస్‌ జగన్‌

Advertisement
Advertisement