6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధం | Sakshi
Sakshi News home page

6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధం

Published Mon, Nov 4 2013 3:03 AM

6, 7, blocking the roads in ananthapur district

అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 6, 7 తేదీల్లో 48 గంటల పాటు చేపట్టనున్న రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నేత ఎర్రిస్వామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వారు నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి పోరాటం కొనసాగిస్తోందని గుర్తు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా 900 పైచిలుకు గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయించినట్లు తెలిపారు. మిగిలిన పంచాయతీల్లోనూ మరో రెండు రోజుల్లో తీర్మానాలు చేస్తారన్నారు.
 
 వీటిని మంత్రుల బృందానికి(జీఓఎం)కు పంపుతామన్నారు. ర హదారుల దిగ్బంధం కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు, ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7న జరిగే జీఓఎం సమావేశంలో అన్ని పార్టీలు అభిప్రాయాలను చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన జరిగితే సీమాంధ్రులు ఎంతో నష్టపోతారని మేధావులు, రాజకీయవేత్తలు చెబుతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మెజార్టీ ప్రజల ఆకాంక్షను కూడా లెక్క చేయకుండా విభజన వైపు అడుగులు వేయడం దారుణమన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, కొర్రపాడు హుసేన్‌పీరా, రంగంపేట గోపాల్ రెడ్డి, బండి పరశురాం, మారుతీ ప్రకాష్, మారుతీనాయుడు, జేఎం బాషా పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement