Sakshi News home page

కడపలో సంచలనం :ఓ ప్రముఖ కుటుంబం హత్య!

Published Tue, Oct 7 2014 3:42 PM

కడపలో సంచలనం :ఓ ప్రముఖ కుటుంబం హత్య!

కడప: నగరంలో ఏడాది క్రితం మాయమైన ఓ ప్రముఖుడి కుటుంబానికి చెందిన అయిదుగురు హత్యకు గురయ్యారు. ఈ వార్త కడపలతో సంచలనం సృష్టించింది. శాంతి సంఘం జిల్లా అధ్యక్షుడు, జియోన్ స్కూల్ యజమాని రాజారత్నం ఐజక్, కుమారుడు కృపాకర్, కోడలు మౌనికతోపాటు ముగ్గురు పిల్లలు ఏడాది క్రితం మాయమయ్యారు. రాజారత్నం ఐజక్కు నగరంలో మంచి పేరుంది.నగర ప్రముఖులు అందరితో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. సభలు, సమావేశాలలో ఆయన ఎక్కువగా పాల్గొంటుంటారు.ఈ కుటుంబం మొత్తం ఏడాది నుంచి కనిపించడంలేదని మౌనిక తల్లి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ కుటుంబానికి చెందినవారిని తానే హత్య చేసినట్లు ఓ నిందితుడు పోలీసులకు చెప్పాడు. మృతదేహాలను జియోన్ స్కూల్ ఆవరణలోనే పాతిపెట్టినట్లు తెలిపాడు. దాంతో పోలీసులు అక్కడ  తవ్వకాలు మొదలుపెట్టారు. అయిదుగురి అస్థిపంజరాలు వెలికి తీశారు.  కిరాయి హంతకులు ఈ హత్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల దృష్టిలో అయిదారుగురు నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల కారణంగా ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

తవ్వి బయటకు తీసిన అస్థిపంజరాలు  కృపాకర్, అతని భార్య మౌనిక, ముగ్గురు పిల్లలివిగా భావిస్తున్నారు. అయితే పోస్ట్మార్టం తరువాత మాత్రమే ఆ అస్థిపంజరాలు ఎవరివినేది తెలుస్తుందని పోలీసులు చెప్పారు. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. వారి అస్థిపంజరాలు దొరికనప్పటికీ అవి ఎవరివి, హత్యలు ఎలా జరిగాయి, ఎవరు హత్యలు చేశారు, ఎందుకు హత్యలు చేశారు....తదితర విషయాలు తెలియవలసి ఉంది.
**
 

Advertisement
Advertisement