Sakshi News home page

ముంచుకొస్తున్న గడువు.. ఆ‘దారి’ చూపరు!

Published Mon, Aug 25 2014 2:21 AM

ముంచుకొస్తున్న గడువు.. ఆ‘దారి’ చూపరు!

కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ 2012లో మొదలైన ఆధార్ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. రుణ మాఫీ సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడంతో దీనికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 40,46,601 కాగా.. వీరంతా ఆధార్‌కు అర్హులే. ప్రస్తుతం ఐదు లక్షల మంది ఆధార్ నమోదు చేయించుకున్నా యూఐడీ నెంబర్లు అందకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఐదారు సార్లు నమోదు చేసుకున్నా నెంబర్ రాకపోవడంతో లక్షలాది మంది ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నారు. రెండు లక్షల మందికి పైగా ఇప్పటికీ నమోదు చేసుకోలేకపోయారు.

ఈ విషయమై ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. వేచి చూడాల్సిందే తప్ప తామేమీ చేయలేమనే సమాధానం ఇస్తుండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించినా.. ఆధార్ ఉంటేనే వర్తిస్తుందనే మెలిక పెట్టింది. అయితే చాలా మంది రైతులు ఇప్పటికీ ఆధార్ నమోదు చేసుకోకపోవడం.. కొందరికి యూఐడీ నెంబర్లు రాకపోవడంతో రుణ మాఫీకి అర్హులవుతామో లేదోననే బెంగ వెంటాడుతోంది. అదేవిధంగా ఈనెల 26లోగా ఆధార్ నెంబర్లు ఇస్తేనే ఆగస్టు నెల పింఛన్లు మంజూరవుతాయని డీఆర్‌డీఏ అధికారులు ప్రకటించారు. నెలాఖరులోగా రేషన్ కార్డుల్లోని కుటుంబ సభ్యులందరి పేర్లను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పట్టాదారులను సైతం ఆధార్ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం ముమ్మరమైంది.

ఎన్‌ఆర్‌ఈజీఎస్ కూలీల జాబ్ కార్డులను ఆధార్‌తో ముడిపెట్టి కూలీలకు ఆ నెంబర్ ఆధారంగానే పేమెంట్లు అందజేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లను ఆధార్‌తో లింకప్ చేయాలనే ఒత్తిళ్లు అధికమవడం తెలిసిందే. విద్యార్థుల స్కాలర్‌షిప్ సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్ ప్రామాణికం కానుండటంతో తమ పరిస్థితి ఏమిటని ఇప్పటి వరకు నెంబర్ అందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ యూఐడీ నెంబర్లు అందకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోల్పోయే పరిస్థితి నెలకొంది. 2013-14 సంవత్సరానికి జిల్లాలో దాదాపు 10వేల మంది విద్యార్థులకు ఆధార్ లేకపోవడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

 97 శాశ్వత ఆధార్ సెంటర్లు
 జిల్లాలో ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లు లేవు. మీ-సేవ కేంద్రాల్లోనే ఆధార్ నమోదుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఇలా ప్రస్తుతం 97 మీ-సేవ కేంద్రాల్లో శాశ్వత ఆధార్ కిట్లను అమర్చారు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఉచితంగా చేయాల్సి ఉండగా.. తప్పుల సవరణకు మాత్రమే రూ.15 ఫీజు వసూలు చేస్తారు. డిమాండ్ నేపథ్యంలో ఈ కేంద్రాల్లో కొన్ని దోపిడీకి చిరునామాగా మారాయి. నమోదుకు రూ.50 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement