పాలన అంతా ఒకే చోట | Sakshi
Sakshi News home page

పాలన అంతా ఒకే చోట

Published Wed, Jun 10 2015 8:27 PM

పాలన అంతా ఒకే చోట - Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ రాజధాని నగరంలో పరిపాలనకు సంబంధించిన అన్ని విభాగాలకూ 1,228 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కాంప్లెక్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని ప్రభుత్వ కాంప్లెక్స్‌గా (క్యాపిటల్ గవర్నమెంట్ కాంప్లెక్స్) పిలిచే ఈ ప్రాంతంలోనే అసెంబ్లీ, సెక్రటేరియేట్, హైకోర్టు,  రాజ్‌భవన్, వివిధ శాఖల డెరైక్టరేట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించింది.

సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలు తయారుచేసిన మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా సీడ్ క్యాపిటల్‌లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఈ భవనాలు నిర్మిస్తారు. సీడ్ క్యాపిటల్  16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రభుత్వ కాంప్లెక్స్‌లో కృష్ణానదీ ముఖంగా సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు నిర్మించ నున్నారు. నివాస భవనాలు కూడా ఈ కాంప్లెక్స్‌లోనే ఉండేలా వ్యూహరచన చేశారు. ఈ భవనాల్లో దేన్ని ఎంత విస్తీర్ణంలో నిర్మించాలనే విషయాలను కూడా ఖరారు చేశారు.

ప్రభుత్వ కాంప్లెక్స్‌లో అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలను అత్యధికంగా 335 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఆ తర్వాత డెరైక్టరేట్లకు అత్యధికంగా 260 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. కాంప్లెక్స్‌లో ముఖ్యమంత్రి సెక్రటేరియేట్‌ను అతి తక్కువగా 15 చదరపు మీటర్లలో నిర్మించనున్నారు.

ఈ భవనాలన్నింటినీ అంతర్జాతీయ ప్లానింగ్ నిబంధనలు, అర్బన్ డిజైన్ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర సంస్కృతి, చరిత్ర ప్రతిబింబించేలా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు పెద్దఎత్తున తిరుగుతూ సమావేశాలు, కాన్ఫరెన్సులు నిర్వహించే ఈ ప్రాంతాన్ని హైసెక్యూరిటీ జోన్‌గా మారుస్తారు. ఈ ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్, ఆర్కిటెక్చర్ నమూనాలు తయారుచేసేందుకు సీసీడీఎంసీ కన్సల్టెంట్లను ఆహ్వానించింది.

Advertisement
Advertisement