‘సీమ’ సమగ్రాభివృద్ధికి పోరాటమే మార్గం | Sakshi
Sakshi News home page

‘సీమ’ సమగ్రాభివృద్ధికి పోరాటమే మార్గం

Published Tue, Aug 25 2015 3:23 AM

‘సీమ’ సమగ్రాభివృద్ధికి పోరాటమే మార్గం - Sakshi

ప్రత్యేక ప్యాకేజీ సాధన సమితి కన్వీనర్ ఈశ్వరయ్య
కడప అగ్రికల్చర్ :
రాయలసీమలో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా రాయలసీమ ప్రజానీకం ఉద్యమానికి సన్నద్ధం కావాలని వైఎస్‌ఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శి, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ సాధన సమితి కన్వీనర్ జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కడప నగరంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. శని, ఆదివారాల్లో కడపలో రాయలసీమ అభివృద్ధి మహాసభలను నిర్వహించామన్నారు. ఈ సభల్లో రాయలసీమ వెనుకబాటు తనం, అందుకు దారితీసిన పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై మేధావులు విపులంగా చర్చించారన్నారు.

ఇప్పటికే నష్టపోయిన రాయలసీమ ఇకపై కూడా నష్టపోకుండా ప్రజానీకాన్ని వెన్నుతట్టి ఉద్యమానికి సమాయత్తం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు పారిశ్రామిక అభివృద్ధి, ప్రాజెక్టుల పూర్తి, కృష్ణా నీటిలో నికర జలాల కేటాయింపు, కడపలో ఉక్కు పరిశ్రమ, విద్యా సంస్థల ఏర్పాటు, హైకోర్టు బెంచ్ కోసం ఉద్యమించాలన్నారు. హైదరాబాద్ తరహాలో లక్షల కోట్లతో ఒకే ప్రాంతంలో రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవడం తగదన్నారు. అంతకు ముందు రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ సాధన సమితి కన్వీనర్‌గా వైఎస్‌ఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శి జి ఈశ్వరయ్యను ఎంపిక చేశారు. చిత్తూరు నుంచి జల్లి విశ్వనాథ్, అనంతపురం నుంచి జాన్సన్, కర్నూలు నుంచి లెనిన్‌బాబు, వైఎస్‌ఆర్ జిల్లా నుంచి కె సురేష్‌బాబు, ఎల్ నాగసుబ్బారెడ్డిలు సభ్యులుగా ఎంపికయ్యారు.
 
‘సీమ’ అభివృద్ధి మహాసభ తీర్మానాలు..
- రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ‘కృష్ణా’లో నికర జలాలు కేటాయించాలి.
- రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, పన్నుల మినహాయింపు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి.
- ‘సీమ’ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి.
- విభజన చట్టంలోని అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలి.
- సెయిల్ ఆధ్వర్యంలో కడపలోనే భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి.
- విద్య, వైద్య సంస్థలు, హైకోర్టు బెంచ్‌ను ‘సీమ’లో ఏర్పాటు చేయాలి.
- వ్యవసాయ, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.
- రాష్ట్ర రాజధానికి అనుసంధానిస్తూ రోడ్లు, రైల్వే మార్గాలను ఏర్పాటు చేయాలి.
- బెరైటీస్, డోలమైట్, చైనా క్లేవ్ ఐరన్‌ఓర్, లైమ్‌స్టోన్, మాంగనీసు, ఇసుక ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.

Advertisement
Advertisement