ఆధ్యాత్మిక శిఖరం అమీన్‌పీర్ దర్గా | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక శిఖరం అమీన్‌పీర్ దర్గా

Published Thu, Mar 5 2015 1:34 AM

Amin Pir Dargah spiritual peak

కడప నగరంలోని అమీన్‌పీర్ దర్గాలో ప్రార్థన చేస్తూ ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఈ విశ్వాసంతోనే సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు నిత్యం పెద్ద సంఖ్యలో దర్గా సందర్శన కోసం వస్తుంటారు. పెద్ద దర్గాగా అందరికీ సుపరిచితం. నేటి నుంచి 10వ తేదీ వరకు ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాత్రి విద్యుత్ దీపాల వెలుగులో దర్గా
 కాంతులీనుతున్న దృశ్యమిది.   
 
 కడప కల్చరల్, న్యూస్‌లైన్ : ఆ దర్గాలో గురువుల మజార్ల వద్ద కాసేపు ధ్యానంలో కూర్చొని మనసులో ఏం కోరుకున్నా ఫలిస్తుందన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ దర్గాను దర్శించుకునేందుకు సామాన్యుడి నుంచి అత్యున్నత స్థాయి వ్యక్తులు కూడా వస్తుంటారు. విదేశీ భక్తుల విశ్వాసాన్ని కూడా చూరగొన్న కడప పెద్దదర్గా ఆస్తాన్-ఏ-మగ్దూమ్- ఇలాహి సయ్యద్‌షా అమీన్ పీర్ దర్గా జిల్లాలో ఒకానొక ముఖ్య పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
 
 విశిష్ట చరిత్ర
 ఈ దర్గాకు సంబంధించిన ప్రథమ సూఫీ హజరత్ ఖాజా సయ్యద్‌షా పీరుల్లా మహ్మద్ ఛిఫ్తివుల్ ఖాద్రి నాయబ్-ఏ- రసూల్ కర్నాటకలోని బీదర్ ప్రాంతం నుంచి 16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి వచ్చారు. సూఫీ తత్వాలతో ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచారు. నాటి కడప నవాబు నేక్‌నామ్‌ఖాన్ ఈయనకు ప్రియ శిష్యుడు. ఆయన 1716లో జీవసమాధి అయ్యాక నవాబు ఆయన కోసం ప్రత్యేకంగా మజార్‌ను నిర్మించారు. అదే ప్రస్తుతం అమీన్ పీర్ దర్గాగా విలసిల్లుతోంది.
 
 ప్రస్తుతం దర్గా వారసులుగా ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేని సూఫీ సర్ పీఠాధిపతిగా ఉన్నారు. చిన్న వయసులోనే అనేక మతగ్రంథాలను ఆకళింపు చేసుకొని ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని సాధించిన ఈయన శిష్యకోటికి కొంగుబంగారంలా నిలిచారు. దర్గాపై అపార విశ్వాసం గల భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. నాటి నీలం సంజీవరెడ్డి నుంచి దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, విశ్వ సినీ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ అగ్ర సినీతారలు అమీర్‌ఖాన్, అభిషేక్, ఐశ్వర్యరాయ్‌బచ్చన్‌లు, తెలుగు సినీ నటులు తరచూ ఈ దర్గాను దర్శిస్తుంటారు.
 
 సేవామార్గం
 కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలేగాక దర్గా ఆధ్వర్యంలో పేద, అనాథ బాలలకు ఆశ్రయం కల్పించి సాధారణ విద్యతోపాటు ఆధునిక, సాంకేతిక వృత్తి విద్యల ను కూడా నడుపుతున్నారు.  ప్రతి సంవత్సరం పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈనెల 5నుంచి నుంచి 10వ తేదీ వరకు ఉరుసు, గంధం, ఇతర ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖ కవులతో ముషాయిరా, గాయకులతో ఖవ్వాలీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖ డ్రమ్మర్ శివమణి తన వాయి ద్య విన్యాసాలతో అలరించనున్నారు.
 
 సందడే సందడి
 ఉరుసు సందర్భంగా పెద్ద ఎత్తున దుకాణాలు దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తారు. పిల్లల వినోదం కోసం చేసే ప్రత్యేక ఏర్పాట్లతో ఉరుసు తిరునాలను తలపిస్తుంది. ప్రతిరోజూ రాత్రి 2గంటల వరకు దర్గా ప్రాంగణం భక్తులతో కోలాహలంగా ఉంటుం ది. నగరానికి చెందిన అన్ని మతాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement