అమ్మహస్తానికి మంగళం! | Sakshi
Sakshi News home page

అమ్మహస్తానికి మంగళం!

Published Wed, Jun 11 2014 12:45 AM

అమ్మహస్తానికి మంగళం! - Sakshi

 సాక్షి, రాజమండ్రి :రాష్ర్టం విడిపోయింది.. ప్రభుత్వం మారిపోయింది.. ఇక ఎలాగూ ఈ పథకం ఎత్తివేస్తారని అనుకున్నారో ఏమో! ఎటువంటి ఉత్తర్వులూ లేకుండానే అమ్మహస్తం పథకానికి అధికారులు చెల్లుచీటీ చెప్పేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించింది. దీనికింద మొత్తం తొమ్మిది సరుకులు ఇవ్వాల్సి ఉండగా.. మూడు నెలలుగా రెండు మూడు సరుకులు మాత్రమే పంపిణీ చేశారు. చివరకు ఈ నెల నుంచి మొత్తం పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు.  తెల్లకార్డుదారులకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు చౌకగా అందించడం అమ్మహస్తం పథకం లక్ష్యం.
 
 దీని ద్వారా పామాయిల్ లీటరు; కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి, ఉప్పు కిలో చొప్పున; పంచదార ఒకటిన్నర కిలో; కారం పావుకిలో; పసుపు 100 గ్రాములు; చింతపండు అరకిలో కలిపి రూ.185కే ఇస్తున్నట్టు ప్రకటించారు. సకాలంలో అన్ని సరుకులూ ఇవ్వకపోవడం, ఇచ్చినవి కూడా నాణ్యత లేకపోవడంతో ప్రవేశపెట్టిన ఆరు నెలలకే ఈ పథకం నీరుగారింది. తొలుత కారం, పసుపు, చింతపండు పంపిణీ నిలుపు చేశారు. గత మార్చి నుంచి ఉత్పత్తి కొరత పేరుతో పామాయిల్ పంపిణీ పూర్తిగా   నిలిపివేశారు. మరోపక్క పురుగులు పట్టిన గోధుమ పిండి, గోధుమలు పంపిణీ చేస్తుండడంతో వాటిని తీసుకునేందుకు కార్డుదారులు నిరాకరించారు. ప్రస్తుతం కందిపప్పు, పంచదార మినహా మిగిలిన ఏడు రకాల సరుకుల పంపిణీని పూర్తిగా నిలిపివేశారు.
 
 ఇక మావల్ల కాదు..
 ఇకపై అమ్మహస్తం సరుకులు పంపిణీ చేయలేమని పౌర సరఫరాల అధికారులు చేతులెత్తేశారు. పామాయిల్ కూడా మరో రెండు మూడు నెలల వరకూ వచ్చే అవకాశాలు లేవని వారు చెబుతున్నారు. తమ డిపోలో కార్డుల సంఖ్య ఆధారంగా కావల్సిన సరుకుల కోసం డీలర్లు నెలాఖరులోగా పౌర సరఫరాల శాఖ పేరిట ముందుగా డీడీలు తీయాలి. ఆ సొమ్ము అందిన తరువాత.. తరువాతి నెల మొదటి వారంలో డీలర్లకు సరుకులు పంపిణీ చేస్తారు. కాగా, ‘అమ్మహస్తం’ సరుకులకు సంబంధించి డీడీలు తీయవద్దంటూ ఇప్పటికే డీలర్లకు అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
 
 ఈ నేపథ్యంలో ఈ పథకం ఎత్తివేశారని, ఇకపై కందిపప్పు, పంచదార మినహా మిగిలిన సరుకులు ఇవ్వరని కార్డుదారులకు రేషన్ డీలర్లు చెప్పేస్తున్నారు. కాగా మరోపక్క చౌకబియ్యం పంపిణీపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నేత ఎన్‌టీ రామారావు కిలో రూ.2 బియ్యం పథకం అమలు చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ పథకాన్ని కార్డుదారులకు భారంగా మార్చేశారు. తొలుత రూ.3.25కు, తరువాత రూ.5కు పెంచేశారు. మహానేత వైఎస్ హయాంలో కిలో రూ.2 బియ్యం అమలు చేశారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతో దీని ధర మళ్లీ పెంచే అవకాశం ఉందని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement
Advertisement