చంద్రబాబు జిత్తులమారి నక్క | Sakshi
Sakshi News home page

చంద్రబాబు జిత్తులమారి నక్క

Published Sat, Feb 9 2019 12:54 PM

Ananta Venkatram Reddy Slams Chandrababu naidu - Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు జిత్తులమారి నక్క అని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ నెల 11న అనంతపురం శివారులోని అశోక్‌ లైల్యాండ్‌ ఎదురుగా నిర్వహించనున్న సమర శంఖారావం సభకు సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. సభా వేదికకు సంబంధించి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్నాడని, ఆయన కుట్రలను వైఎస్సార్‌సీపీ శ్రేణులో సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే బూత్‌ కమిటీలే కీలకమని, అందుకోసమే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బూత్‌ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని విస్మరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, ఇప్పుడు ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక అప్పటి వరకు కిలో బియ్యం రెండు రూపాయలు ఉండగా, చంద్రబాబు ఐదు రూపాయల ఇరవై పైసలు చేశారన్నారు. అనంతపురం జిల్లాలో హంద్రీనీవాకు మూడు సార్లు శంకుస్థాపన చేసి ఆ తర్వాత వదిలేశారన్నారు.

తాజాగా పెన్షన్‌ రూ.2వేలు, డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ప్రకటించడం వైఎస్‌ జగన్‌ నవరత్నాలను కాపీ కొట్టడమేనన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జనం విశ్వసిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు బాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నవరత్నాలను తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సమయంలో ఆ పథకాలు అమలు చేయాలంటే కేంద్ర బడ్జెట్‌ సరిపోదని చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు వాటినే కాపీ కొడుతున్నారన్నారు.

ఎన్నికల సమయంలో పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులను మహిళా సంఘాలకు ఇవ్వడంలో మోసం ఉందన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ మోసపూరితమని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతోందన్నారు. ఎస్సీల సంక్షేమం కోసం తీసుకొచ్చిన సబ్‌ప్లాన్‌ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్‌ ప్రకటిస్తే, అందులో కాపులకు ఐదు శాతం అంటూ చంద్రబాబు చేసిన ప్రకటన మరోసారి కాపులను మోసగించడమేనన్నారు. కాపులు తమను బీసీల్లో చేర్చాలని డిమాండ్‌ చేస్తుంటే, ఈబీసీ రిజర్వేషన్లలో వాటా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా మోసం చేయడమేనని, కులాల వారీగా చీల్చి అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తున్నాడన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నేతలు కోగటం విజయ్‌భాస్కర్‌రెడ్డి, చింతా సోమశేఖర్‌రెడ్డి, పెన్నోబిలేసు, సాకే చంద్ర, రోషన్‌ జమీర్, ప్రకాష్‌రెడ్డి, గోవిందరెడ్డి, నగేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement