అంగన్‌వాడీల వేతన వెతలు | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల వేతన వెతలు

Published Mon, Feb 16 2015 12:55 AM

అంగన్‌వాడీల వేతన వెతలు - Sakshi

  • ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించక, కనీస వేతనాలూ అందక ఇక్కట్లు
  •  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిన్నచూపు
  •  పొరుగు రాష్ట్రాల్లో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్
  •  అమలుకు నోచుకోని హామీలు
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు కొన్నేళ్లుగా వేతన పెరుగుదల లేక అల్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాలు, ప్రస్తుత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలుకాక కుంగిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా 35 వేల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పనిచేస్తున్న సుమారు 70 వేల మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు... గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు విద్య, పౌష్టికాహారం వంటి అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. పార్ట్‌టైం ఉద్యోగులైనప్పటికీ పూర్తిసమయాన్ని కేటాయించి పనిచేస్తున్నారు.

    ప్రస్తుతం అంగన్‌వాడీ వర్కర్లు రూ. 4,200 (కేంద్రం రూ. 3 వేలు, రాష్ర్టం రూ. 1,200), హెల్పర్లు రూ. 2,200 (కేంద్రం రూ. 1,500, రాష్ట్రం రూ. 700) చొప్పున గౌరవ వేతనం అందుకుంటున్నారు. అయితే ఏడేళ్ల నుంచి వేతనాలు, పదేళ్ల నుంచి ప్రమోషన్లకు పరీక్షలు లేకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా తంటాలు పడుతున్నారు.
     
    అమలుకాని గత హామీలు

    ఉమ్మడి రాష్ట్రంలో (గత ఫిబ్రవరిలో సమ్మె సందర్భంగా) అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికల సభల్లో అంగన్‌వాడీలకు నెలకు రూ.15 వేల వేతనం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని నిలుపుకోవట్లేదని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి. గౌరవవేతనం పెంపుదల, పీఎఫ్ ఇతర రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతామని, తెల్లరేషన్ కార్డులిచ్చి ఆరోగ్యశ్రీ అమలయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిస్తామని, ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూస్తామని, ప్రభుత్వ ఆమోదం తర్వాత గౌరవవేతనం పెంచుతామని, పెండింగ్‌లో ఉన్న వేతనాల చెల్లింపు, ఇతర బిల్లుల చెల్లింపు బడ్జెట్ విడుదల తర్వాత ఇస్తామని కొత్త రాష్ట్రంలో గత ఏడాది నవంబర్ 18న చేపట్టిన ‘చలో హైదరాబాద్’ నిరసనల సందర్భంగా అంగన్‌వాడీ సంఘాలతో అప్పటి మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ డెరైక్టర్ ఆమ్రపాలి రాతపూర్వకంగా హామీలు ఇచ్చారు. అవి కనీసం పరిశీలనకు కూడా నోచుకోలేదు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, హర్యానా తదితర రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పింఛన్ల వంటివి ఇస్తున్నారు. మహారాష్ట్రలో వర్కర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.75 వేల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్, మిగతా రాష్ట్రాల్లో పెన్షన్లు, తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేత నాల చెల్లింపు, కేరళలో ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు.

    అంగన్‌వాడీ వర్కర్లను మూడోతరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా, హెల్పర్లను నాలుగోతరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఇది జరిగే వరకు వర్కర్లకు రూ.15 వేలు, హెల్పర్లు, మినీవర్కర్లకు రూ.12 వేల చొప్పున కనీస వేతనాలు చెల్లించాలని అంగన్‌వాడీ సంఘాలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి పనిచేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా తమకు ఏమాత్రం న్యాయం జరగడం లేదంటున్నాయి.

    కేంద్రం నుంచి నిధులు అందుతున్నందున తాము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా కనీస వేతనం చెల్లించేందుకు కూడా అంగీకరించలేమని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించే ఎక్కువగా పనిచేస్తున్నందున కేంద్రం కూడా పెద్దగా పట్టించుకోవట్లేదని సంఘాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబోమని చెబుతూనే మరోవైపు తెల్లరేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు పింఛన్లకు వీరు అర్హులు కారంటూ ప్రభుత్వం చెబుతుండటం గమనార్హం.
     
    డిమాండ్లు పరిష్కరించాలి అంగన్‌వాడీ సంఘాలు

    ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు కనీస వేతనం చెల్లించాలని, ఐసీడీఎస్ ప్రాజెక్టులను పటిష్టంగా అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. ప్రతినెలా 5న గౌరవ వేతనాలు చెల్లించడంతోపాటు గత 10 నెలలుగా పెండింగ్‌లో ఉంచిన సెంటర్ల అద్దె బకాయిలను చెల్లించాలని అంగన్‌వాడీ వర్కర్ల సంఘం (ఏఐటీయూసీ) జనరల్ సెక్రటరీ కరుణ కుమారి డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి అన్ని కేంద్ర సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 26న నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement