బాబోయ్‌..అంగన్‌'వేడి' | Sakshi
Sakshi News home page

బాబోయ్‌..అంగన్‌'వేడి'

Published Sat, May 19 2018 8:55 AM

Anganwadi Activists Commits Suicicde In Kurnool - Sakshi

కాకినాడ రూరల్‌: జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లపై పని భారం పెరిగిపోతోంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేని రాజోలు, సామర్లకోట, అమలాపురం, కాకినాడ, పిఠాపురం, తుని తదితర ప్రాజెక్టుల పరిధిలో అనేక మంది కార్యకర్తలు ఇప్పటికే ఉద్యోగాలు వదిలిపెట్టేశారు. అరకొర జీతాలతో కాలం వెళ్లబుచ్చుతున్న వీరిపై అనేక రకాల పనులు నిర్వహించాలని ఒత్తిడి పెంచుతున్నారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా మొదటిగా ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఈ కార్యకర్తలే. ఉద్యోగ భద్రత లేని వీరు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించాలి.

కొత్తగా గృహ సందర్శనలు, 12 రికార్డులు, హ్యాండ్‌ రైడ్‌ ఫోన్‌లో (సెల్‌లో) 8 రికార్డుల నిర్వహణ చేయాల్సి ఉంది. ఒకే ఉద్యోగి ఇటు కేంద్రం నిర్వహణ, అటు రికార్డుల భారం, ఆన్‌లైన్‌ పనులు, ప్రభుత్వ పథకాల ప్రచారం, అన్న అమృత హస్తం (వంట చేసి గర్భిణులకు పెట్టే కార్యక్రమం) తదితర కార్యక్రమాల ఆదనపు భారంతో సతమతమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వ టార్గెట్లు, గడువులోపు చేరుకోకుంటే చర్యలు ఇలా జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు సతమతమవుతున్నారు. ఇటీవల కాలంలో కమిషనర్‌ స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి అందరి సమక్షంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లను తిట్టడంతోపాటు ఉదయం 9 గంటలకు విధులకు హాజరైన సూపర్‌వైజర్లు రాత్రి 9, 10 గంటలైనా ఇంటికి వెళ్లలేని పరిస్థితి స్త్రీ శిశుసంక్షేమ శాఖలో నెలకొంది. కనీసం ఇంట్లో దగ్గరి బంధువుల వివాహాలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డిప్యుటేషన్ల భారం...
ఇటీవల కాలంలో సూపర్‌వైజర్లకు జిల్లాలో డిప్యూటేషన్‌ భారం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా చేరిన వ్యక్తులను, చిన్న పిల్లల సంతానం ఉన్న వారిని సైతం ఏజెన్సీ ప్రాంతాలైన చింతూరు, వీఆర్‌పురం వంటి ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై పంపించడంతో సూపర్‌ వైజర్లు అనేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో అనేక మంది సూపర్‌వైజర్లు రెండు మూడేళ్ల నుంచి కూడా డిప్యుటేషన్‌తో సతమతమవుతూ అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్న సంఘటనలున్నాయి. సూపర్‌వైజర్లకు బదిలీలు లేకపోవడంతోపాటు జీవో 10 ప్రకారం అన్ని అధికారాలు కలెక్టర్‌ పరిధిలోకి వెళ్లిపోవడంతో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నామంటున్నారు. జీవో 10ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా పట్టించుకోకపోవడం విచారకరం. ఇటీవల కాలంలో సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కేంద్రాల్లో జరిగే ప్రతి పనిని ఆన్‌లైన్‌ చేయాల్సి రావడం, అధికారులు అనుకున్నదే తడవుగా ఇచ్చిన పనిని ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశించడంతో ఒత్తిడిని భరించలేకపోతున్నారు. మరోవైపు బయోమెట్రిక్‌ విధానం మరింత ఆందోళన కలిగిస్తోందంటున్నారు. అధికారులు పెడుతున్న టార్గెట్లకు భయపడిపోయి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లకు లక్ష్యాలు నిర్ణయించడంతో ఒత్తిళ్లను తట్టుకోలేక ఇటీవల కాలంలో తాళ్లరేవు ప్రాజెక్టు పరిధిలోని పాతర్లగడ్డ, నడకుదురు, వాకాడ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలు మరణించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలపై మరింతగా పని భారాన్ని పెంచుతుండడం వల్లే ఇటువంటి మరణాలు సంభవిస్తున్నాయని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు అసోసియేషన్‌ తీవ్రంగా విమర్శిస్తోంది. ఇటీవల కాలంలో ‘ట్యాబ్‌ వర్కు’ అంటూ బెదిరించడంతో ఉద్యోగాలను వదిలేసుకుంటున్న సందర్భాలున్నాయి. అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు ఐదు నెలలుగా వేతనాలు రాకపోవడంతో పస్తులున్నా పట్టించుకొనేవారే కరువయ్యారని వాపోతున్నారు.   

టార్గెట్లు, పని ఒత్తిడితోనే..
కర్నూలులో సూపర్‌ వైజర్‌ మృతికి కారణం వేధింపులే. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏ శాఖలో లేని పని ఒత్తిడి పెరిగిపోయింది. సూపర్‌వైజర్లు రాత్రి 10, 11 గంటల వరకు పని చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఆన్‌లైన్, బయోమెట్రిక్‌ ఒత్తిడితో సతమతమవుతున్నారు. సర్వర్లు పని చేయకపోవడంతో రాత్రంతా మేల్కొని ఉండి ఎప్పుడు పని చేస్తే అప్పుడు ఆన్‌లైన్‌ చేయాల్సి వస్తోంది. దీంతో అనేక మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యాల బారిన పడుతున్నారు. కమిషన్‌ స్థాయి అధికారులే నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టి మరీ తిడుతున్నారు. ఈ విధానంలో మార్పు రావల్సిన అవసరం ఉంది.– ఎం. వీరలక్ష్మి,అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు

ఆళ్లగడ్డ ఐసీడీఎస్‌సూపర్‌వైజర్‌ ఆత్మహత్య
ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం లేదని అధికారులు వేధించడంతో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఐసీడీసీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో బత్తలూరు సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న శోభారాణి శుక్రవారం కలెక్టరేట్‌ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. తన చెల్లెలి కుమారుడి పెళ్లి ఈ నెల 8న ఉందని సెలవు మంజూరు చేయాలని అభ్యర్థించినా  ‘ఆడబిడ్డను కాపాడుకుందాం’ అనే కార్యక్రమంపై ర్యాలీ ఉందని సెలవు ఇచ్చేది లేదని సంబంధితాధికారి చెప్పడం, అంతకు ముందు ఏవో కారణాలు చూపించి నోటీసులు ఇవ్వడంతోతీవ్ర మనస్తాపానికి గురై  కలెక్టర్‌ కార్యాలయంపై అంతస్తునుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Advertisement
Advertisement