ఆశలన్నీ డీఎస్సీపైనే! | Sakshi
Sakshi News home page

ఆశలన్నీ డీఎస్సీపైనే!

Published Mon, Oct 20 2014 2:28 AM

ఆశలన్నీ డీఎస్సీపైనే! - Sakshi

 ఏలూరు సిటీ: డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యమవున్న కొద్దీ.. అదే ఆశ.. శ్వాసగా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం నాడే డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పిన విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆనక పలు కారణాలు చెబుతూ దాటవేస్తున్నారు. చివరకు సెకండరీ గ్రేడ్ పోస్టుల్లో బీఎడ్ అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకే ఈ ఆలస్యమంటూ చెబుతూ.. సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.
 
 బీఈడీలకు మొండి చెయ్యేనా?
 జిల్లాలో బీఈడీ అభ్యర్థులు 30 వేలకు పైగా ఉన్నారు. పోస్టుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. జిల్లాలో డీఎస్సీలో 605 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందుల్లో 400 పోస్టులకు పైగా సెకండరీ గ్రేడ్ పోస్టులే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు భారీ సంఖ్యలో ఉంటే డీఎడ్ అభ్యర్థులు తక్కువగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీఎడ్ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లోనూ అవకాశం ఇవ్వకుంటే ఇబ్బందులు పడతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం ఎస్జీటీ పోస్టుల్లో బీఎడ్‌లకూ అవకాశం ఇస్తామని మభ్యపెడుతూ వస్తోంది. కానీ కేంద్ర సర్కారు అనుమతి ఇవ్వకుంటే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
 
 కేంద్రం ఒప్పుకొంటుందా?
 విద్యాహక్కు చట్టం మేరకు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి డీఎడ్ అభ్యర్థులనే భర్తీ చేయాలనే నిబంధన బీఎడ్ అభ్యర్థులకు శాపంలా మారింది. అసలు ఎస్జీటీ పోస్టుల్లో వీరికి అవకాశం ఇవ్వడమనేది కేంద్రం పరిధిలో ఉంది. పైగా జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉంది. విద్యారంగంలోని మార్పుల్లో భాగంగానే ఎస్జీటీ పోస్టుల్లో  డీఎడ్ అభ్యర్థులు, ఎస్‌ఏ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు ఉండాలనే నిబంధన విధించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర సర్కారు చెబుతున్న విధంగా కేంద్రం అంగీకారం తెలుపుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
 
 బీఈడీలకు అవకాశం దక్కేనా?
 విద్యాహక్కు చట్టం, ఎస్సీఈఆర్‌టీ ప్రతిపాదనల మేరకు ప్రాథమిక పాఠశాలల్లో భర్తీ చేసే పోస్టుల్లో డీఎడ్ అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో బీఎడ్‌లకు ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని కోరగా కేంద్రం తిరస్కరించింది. మరి ఏపీ రాష్ట్రానికి అనుమతి ఇస్తుందా అనే విద్యారంగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వ స్తున్న రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా నోటిఫికేషన్ ఇస్తే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
 
 అందరిలోనూ ఉత్కంఠే
 ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ జాప్యంతో తీవ్ర ఉత్కంటకు గురవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు హయాంలో డీఎస్సీ ప్రకటించినా నోటిఫికేషన్‌కు నోచుకోలేదు. రెండుసార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను సైతం రాశారు. అప్పట్లో టెట్ పరీక్ష నిర్వహించబోమని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి నిర్వహిస్తామని చెబుతోంది. గతంలో టెట్‌లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు మళ్లీ టెట్ రాయాల్సి రావటం ఇబ్బందిగా మారింది. వేలకువేలు ఖర్చు చేసి ఉద్యోగాల కోసం వేచి చూస్తోన్న అభ్యర్థులు డీఎస్సీ జాప్యంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా విద్యామంత్రి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement