గజగజ | Sakshi
Sakshi News home page

గజగజ

Published Sun, Oct 12 2014 12:49 AM

గజగజ

 ఏలూరు:తీరం వైపు మహోగ్రంగా దూసుకొస్తున్న హుదూద్ పెను తుపాను జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను వణికిస్తోంది. ఏ క్షణాన ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న ఆందోళన ప్రజలను, అధికారులను కలవరపెడుతోంది. జిల్లా యంత్రాం గం నష్ట నివారణ చర్యల్లో నిమగ్నమైంది. విశాఖ పట్నం నుంచి 36 మంది సభ్యులు గల కోస్టుగార్డు బృందం, గుంటూరు నుంచి 40 మంది సభ్యులు గల జాతీయ విపత్తుల నివారణ (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందం జిల్లాకు చేరుకున్నారుు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నరసాపురం, మొగల్తూరు మండలాలపై యంత్రాం గం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ రెండు మండలాల్లో 14 పునరావాస కేంద్రాలను, కాళ్ల, భీమవరం, యల మంచిలి మండలాల్లో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 5,045 మందికి పునరావాసం కల్పించారు.
 
 సీఎం ఆరా
 తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన చర్యలపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కలెక్టర్ కె.భాస్కర్‌తో మాట్లాడిన ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా ఎదుర్కోవాలని ఆదేశించారు. ఇదిలావుండగా, అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు తీర గ్రామాల్లోనే మకాం వేశారు. నరసాపురం మండలంలో సముద్ర తీర గ్రామాలైన వేములదీవి తూర్పు, పడమర, పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, బియ్యపుతిప్ప గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ గ్రామాల్లో ఏర్పాట్లను జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, ఆర్డీవో పుష్పమణి, డీహెఎంహెచ్‌వో శంకరరావు పర్యవేక్షిస్తున్నారు. కేపీ హైస్కూల్, పేరుపాలెం హైస్కూల్‌లో శనివారం రాత్రి భోజనం ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఆ గ్రామాలను సందర్శించారు. ప్రతి గ్రామానికి మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు.
 
 తీర గ్రామాల్లో మంత్రి సుజాత,కలెక్టర్ పర్యటన
 నరసాపురం మండలంలోని తీర గ్రామా ల్లో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, కలెక్టర్ కె.భాస్కర్ శని వారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను ఆదివారం మధ్యాహ్నం తీరం దాటుతుందని, ఆ సమయంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా  గుడిసెలు, పాకల్లో నివాసం ఉంటున్న వారిని బలవంతంగానైనా  పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పెదమైనవాని లంకలో సముద్రం కోతకు గురైన ప్రాంతాన్ని మంత్రి పీతల సుజాత పరిశీ లించారు. ప్రజలు ఎటువంటి ప్రమాదాలకు లోనుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
 రైళ్లు, బస్సులు రద్దు
 హుదూద్ తుపాను తీవ్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అధికారులు విశాఖ వైపు వెళ్లే, అటు నుంచి వచే అన్ని రైళ్లను శనివారం అర్ధరాత్రి నుంచి రద్దు చేశారు. చెన్నై, హౌరా ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లిం చారు. జిల్లా మీదుగా వెళ్లే 15 ఎక్స్‌ప్రెస్ రైళ్లను నుంచి నిలిపివేశారు. గోదావరి, రత్నాచల్, లింక్, బొకారో, తిరుమల తదితర రైళ్లు రద్దయ్యూరుు. విజయవాడ-రాయగడ, రాయగడ-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను సైతం రద్దు చేశారు. హౌరా వైపు వెళ్లే ఫలక్‌నుమా, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించారు. ఉదయం 8.25 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే విశాఖపట్నం రైలును రాజ మండ్రి వరకే నడపాలని నిర్ణయించారు. జిల్లాలోని ఆరు ఆర్టీసీ డిపోల నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సులను శనివారం రద్దు చేశారు. ఆదివారం బస్సులను నడిపేది లేనిది అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని రీజినల్ మేనేజర్ ఆర్.రామారావు తెలిపారు.
 
 రైల్వే స్టేషన్లలోనూ ఏర్పాట్లు
 రైళ్ల రాకపోకలు, రద్దు తదితర వివరాలను తెలుసుకునేందుకు ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన 08812-232267కు ఫోన్ చేయూలని స్టేషన్ మేనేజర్ ఐ.ప్రభాకరరావు సూచించారు. రద్దయిన రైళ్లలో టికెట్లు తీసుకున్న ప్రయూణికులకు సొమ్మును వెనక్కి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏవైనా రైళ్లు ఏలూరు సమీపంలోకి వచ్చాక రద్దు చేయూల్సి వస్తే వాటిలోని ప్రయూణికులకు భోజనం, పిల్లలకు పాలు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
 
 జాగ్రత్త సుమా!
 తుపాను వల్ల తీర గ్రామాల్లో ఏ ఒక్కరికీ ప్రాణహాని లేకుండా చూడాలని కలెక్టర్ కె.భాస్కర్ అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం రాత్రి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఎవరికైనా ప్రాణహాని జరిగితే అందుకు సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. అవసరమైతే ప్రజాప్రతినిధులు, పోలీసుల సహకారం తీసుకుని బలవంతంగానైనా తరలించాలని ఆదేశించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకూ అధికారులెవరూ తమ కార్యస్థానాలను విడిచి వెళ్లొద్దన్నారు.
 
 జాయింట్ కలెక్టర్ టి.బాబురావునాయుడు  మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో గర్భిణులు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. వీలైనంత వరకూ పురుషులు, మహిళలకు వేర్వేరుగా వసతి కల్పించేలా చూడాలన్నారు. గోదావరి, ఎర్రకాలువ, తమ్మిలేరు పరీవాహక ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శెట్టిపేట సమీపంలోని గ్రామాలు, భీమవరంలో యనమదుర్రు డ్రెరుున్ పక్కన మురికివాడలు, మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం, మోళ్లపర్రు, నరసాపురం మండలంలోని చినమైనవానిలంక, పెదమైనవానిలంక ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌వో కె.ప్రభాకరరావు, డీఆర్‌డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, సీపీవో సత్యనారాయణ, గృహనిర్మాణ సంస్థ పీడీ శ్రీనివాసరావు, సెట్‌వెల్ సీఈవో సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ వి.వసంతబాల పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement