ఉద్యోగవర్గపోరు! | Sakshi
Sakshi News home page

ఉద్యోగవర్గపోరు!

Published Sun, Dec 29 2013 4:14 AM

APNGOs  employees Election theme Factionalism

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  సమైక్యం కోసం కలిసిన చేతులు కత్తులు దూస్తున్నాయి. ఒకే స్వరంతో నినదించిన గొంతులు అపస్వరం పలుకుతున్నాయి. ఏపీఎన్జీవోల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు రెండుగా చీలిపోవడంతో వర్గపోరు మొదలైంది. స్థానిక ఎన్జీవో హోం దీనికి వేదికైంది. రాష్ట్ర నేతల సమక్షంలోనే చొక్కాలు పట్టుకున్నారు. పరస్పర నెట్టుకున్నారు. కేకలు వేశారు. మీ సంగతి చూస్తామంటే.. మీ సంగతి చూస్తామంటూ సవాళ్లు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకునేందుకూ ప్రయత్నించారు. ఈ పరిస్థితి చూసి రాష్ట్ర నాయకులు బిత్తరపోతే.. జిల్లా నాయకులు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. దీనికి కారణం గెజిటెడ్ అధికారుల ఓట్లేనని అంటున్నారు. ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తీరుతో సంఘంలో నిప్పు రాజుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం జరిగిన ఘర్షణ ఈ ఆరోపణలను బలపరుస్తోంది. జనవరి 5న జరగనున్న ఎన్జీవో ఎన్నికల్లో అశోక్‌బాబు, బషీర్ ప్యానళ్లు పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూని యన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పోటీలో ఉన్న షేక్ అబ్దుల్ బషీర్, సత్యనారాయణలు శ్రీకాకుళం ఎన్జీవో హోంకు వచ్చారు. ముఖ్య నాయకులతో మాట్లాడిన తరువాత అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించారు.
 
 మాటలతో యుద్ధం మొదలు..
 సమావేశం అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి, ఎన్జీవో సంఘ సభ్యుడు ఉంకిలి శ్రీనివాస్ మాట్లాడుతూ అశోక్‌బాబు ఉద్యోగులను మోసం చేశారని, సమైక్య ఉద్యమాన్ని నీరు గార్చారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూడా విఫలమయ్యారన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు 15 మంది ఉద్యమంలో పాల్గొనలేదని, వారే ప్రస్తుతం గెజిటెడ్ ఉద్యోగులయ్యారని, వారి ఓటును తొలగించాలని సూచించారు.  జిల్లాలో పురుషోత్తంనాయుడు నాయకత్వాన్ని బలపరుస్తున్నామని, అయితే అశోక్‌బాబు తీరు బాగులేనందున, రాష్ట్రస్థాయిలో ఆయన్ను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. దీన్ని జీర్ణించుకోలేని అశోక్‌బాబు వర్గీయులు చల్లా శ్రీనివాస్, ఆర్.వేణులు శ్రీనివాస్‌ను నిలదీసే ప్రయత్నం చేశారు. ఇంతలో శ్రీనివాస్ సహచరుడు, ఎన్‌జీఓ సభ్యుడు వేణు జోక్యం చేసుకొని స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మాకుందని, అడ్డుకునేందుకు మీరెవరని ప్రశ్నించారు. 
 
 దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చొక్కాలు పట్టుకున్నారు. హోం లోపలి నుంచి బయట ఆవరణలోకి వచ్చి కొట్టుకునే ప్రయత్నం చేశారు. దాంతో నాయకులు జోక్యం చేసుకొని ఇరువర్గాల వారికి సర్ది చెప్పారు. ఒక వర్గాన్ని లోపలికి, రెండో వర్గాన్ని బయటకు తీసుకుపోయారు. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. నాన్ గెజిటెడ్ ఉద్యోగులుగా ఉన్నప్పుడు వారికి ఓటు హక్కు లభించిందని, ఇప్పుడు వారు గెజిటెడ్ ఉద్యోగులైనందున ఓటు హక్కు తొలగించాలని కోరడంలో తప్పేమిటని ఉంకిలి శ్రీని వాస్ ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించినందుకే తనపైన, తన సహచరుడిపైన దాడికి ప్రయత్నించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 
 
 ఎన్జీవోల్లో కలకలం
 ఎన్జీవో హోంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాటం చేస్తున్న ఉద్యోగులు ఐక్యంగా ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి.. వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం ఉద్యమాన్ని నీరు గార్చేందుకు యత్నించడం సబబు కాద ని, దీన్ని సహించబోమని పలువురు ఉద్యోగులు అంటున్నారు. కాగా అశోక్‌బాబు వర్గీయులే ప్రణాళిక ప్రకారం ఎన్జీవోల్లో చీలిక  తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
 

Advertisement
Advertisement