అరెస్టులతో ఆగదు.. | Sakshi
Sakshi News home page

అరెస్టులతో ఆగదు..

Published Mon, Aug 19 2013 2:30 AM

అరెస్టులతో ఆగదు.. - Sakshi

* సమైక్య సమ్మెపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు స్పష్టీకరణ
* ఉద్యమానికి నాయకుల కొరత లేదు
* అన్ని శాఖల్లో ఎస్మా పెట్టినా భయపడం
సీమాంధ్ర ఎంపీల రాజీనామాల కోసమే సమ్మె
* ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా వేయాలని డిమాండ్
* నేటి నుంచి సమ్మెలోకి పశుసంవర్థక శాఖ అధికారులు
* 21 అర్ధరాత్రి నుంచి టీచర్లు కూడా...
* న్యాయశాఖ ఉద్యోగుల మద్దతు
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె చేయడం లేదని, సీమాంధ్ర ఎంపీల రాజీనామాలే లక్ష్యంగా చేస్తున్నామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు పునరుద్ఘాటించారు. 177 జీవో(నో వర్క్ నో పే), ఎస్మా వల్ల సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రత ఒక్క డిగ్రీ కూడా తగ్గదని స్పష్టం చేశారు. ఎస్మా ప్రయోగించి సమ్మెకు నేతృత్వం వహిస్తున్న నేతలను అరెస్టు చేసినా ఉద్యమం ఆగిపోదన్నారు. ఉద్యమానికి నాయకుల కొరత లేదని చెప్పారు. భయపెట్టి ఉద్యోగుల సమ్మెను ఆపడం సాధ్యం కాదన్నారు.

సమ్మె కాలానికి తాము జీతాలు అడిగే ప్రసక్తే లేదన్నారు. అన్ని శాఖల్లో ఎస్మా ప్రయోగించినా భయపడబోమన్నారు. దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని, అందరినీ అరెస్టు చేసి జైళ్లలో పెట్టినా ఉద్యమం ఆగదన్నారు. అంతమందిని పెట్టే జైళ్లు ఉంటే అరెస్టులు చేసుకోవచ్చని ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఆదివారం ఏపీఎన్జీవో కార్యాలయంలో ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ సమావేశం అనంతరం ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత చల్లా మధుసూదన్‌రెడి, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, న్యాయవాది జంద్యాల రవిశంకర్, జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

యూపీఏ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే వరకు సమ్మె కొనసాగించి తీరుతామన్నారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్  ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సీమాంధ్ర విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికే కౌన్సెలింగ్ నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం మీద రుద్దారంటూ పరోక్షంగా డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 2 నెలల జాప్యం జరగడానికి ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు.

21 అర్ధరాత్రి నుంచి టీచర్లు కూడా..
ఈనెల 21 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని టీచర్లు నిర్ణయించారని అశోక్‌బాబు తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులూ సమ్మెకు మద్దతు ప్రకటించారన్నారు. వేదిక సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులను పిలిచామన్నారు. కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి, టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్, వైఎస్సార్‌సీపీ నుంచి చల్లా మధుసూదన్‌రెడ్డి, హైకోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు సమావేశంలో పాల్గొన్నారని చెప్పారు. త్వరలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి హైదరాబాద్‌లో సభ ఎప్పుడు, ఎక్కడ పెట్టాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించడం హైదరాబాద్ సభ లక్ష్యమని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ప్రతినిధిగా సమావేశానికి హాజరయ్యానన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సీమాంధ్ర ప్రతినిధే అయినా సమైక్యవాదానికి ఎందుకు మద్దతు ప్రకటించడం లేదు? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ విభజనతో సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందన్నారు.

ఈనెలాఖరులో హైదరాబాద్‌లో సభ నిర్వహించే అవకాశం ఉందని జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మారెడ్డి చెప్పారు. ఈనెల 27న పాలకొల్లులో కళాకారులు, రచయితలకు ‘సమైక్య’ శిక్షణా శిబిరం ఏర్పాటు చేయనున్నామని గజల్ శ్రీనివాస్ తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగులు కూడా విధులకు గైర్హాజరయ్యే దిశగా ఆలోచిస్తున్నారని బార్‌కౌన్సిల్ సభ్యుడు చిదంబరం తెలిపారు. ఈనెల 31 వరకు సీమాంధ్రలోని కోర్టుల్లో విధులకు హాజరుకాకూడదని న్యాయవాదులు ఇప్పటికే నిర్ణయించారన్నారు.

మరోవైపు పశుసంవర్థకశాఖలో సీమాంధ్ర అధికారులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, అసిస్టెంట్ డెరైక్టర్లు, డిప్యూటీ డెరైక్టర్లు, జాయింట్ డెరైక్టర్లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు, ఐటీ ఉద్యోగులు, హైదరాబాద్‌లోని వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

బెదిరేది లేదు...
ఏలూరు: తమ శాఖ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించినా బెదిరేది లేదని, సమైక్యాంధ్ర కోసం  ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొంటామని ఏపీ పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.హరనాథ్ ఏలూరులో ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు. అత్యవసర సేవలందించే శాఖ కూడా కాని పే అండ్ అకౌంట్స్‌పై సమైక్యవాది అయిన ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం బాధాకరమన్నారు.
 
 ఎస్మాకు భయపడం:  సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఉద్ఘాటన
 విజయవాడ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా లాంటి చట్టాలు ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేస్తోందని, అయితే వాటికి భయపడేదే లేదని సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి నాయకులు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం 3 లక్షల మంది ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని, ఎవరిపై చట్టం ప్రయోగిస్తారో ప్రభుత్వం నిర్ణయించుకోవాలన్నారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తాం కానీ వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.

ఆదివారం విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో 13 జిల్లాల ఉపాధ్యాయ సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ఈనెల 21 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. సోమవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేస్తామని కన్వీనర్ ఎం. కమలాకరరావు ప్రకటించారు. సమ్మెకు వెళ్లడానికి ముందు రిలే దీక్షలు చేపట్టాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు సూచించారు.

ఒకటి రెండు సంఘాలు సమ్మెలోకి రాలేదని, వారిని కూడా ఒప్పించి సమ్మెలో పాల్గొనేలా చేస్తామన్నారు. తిరుపతిలో ఎంపీ వీహెచ్‌పై దాడి ఘటనను సమావేశం ఖండించింది. సమావేశంలో ఎమ్మెల్సీ బచ్చుల పుల్లయ్య, సమైక్యాంధ్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు వి.అప్పారావు, డి. ఈశ్వరరావు, డి. గోపీనాథ్, ప్రదీప్‌కుమార్, వెంకటేశ్వరరావు, మణి, జి.వి నారాయణరెడ్డి, గిరిప్రసాద్‌రెడ్డి, 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement