స్తంభించిన గ్యాస్ సరఫరా | Sakshi
Sakshi News home page

స్తంభించిన గ్యాస్ సరఫరా

Published Sun, Feb 2 2014 1:32 AM

స్తంభించిన గ్యాస్ సరఫరా - Sakshi

తగ్గింపు వివరాలు ఏజెన్సీలకు అందని వైనం
 నిలిచిపోయిన విక్రయాలు    
 జిల్లాలో ప్రజల ఇక్కట్లు

 

విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : చమురు కంపెనీలు గ్యాస్ ధరలు తగ్గించినా ఆ మేరకు ఉత్తర్వులు అందకపోవడంతో జిల్లాలో శనివారం సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. చమురు కంపెనీల నుంచి ఏజెన్సీలకు కూడా గ్యాస్ సరఫరా కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీలలో కూడా అమ్మకాలు నిలిచిపోయాయి. ఇటీవల గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజల నెత్తిన భారం మోపిన కేంద్ర ప్రభుత్వం గృహావసరాల గ్యాస్ సిలిండర్‌పై రూ.110, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.270 తగ్గించింది. దీని ప్రకారం గృహావసరాలకు వాడే 14 కేజీల గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం సబ్సిడీతో కలిపి రూ.1,320 ఉండగా ఫిబ్రవరి నుంచి రూ.1,210 చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాన్ సబ్సిడీలో సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ 19 కేజీల సిలిండర్ రూ.2,320 నుంచి రూ.2,050కి తగ్గింది.
 
నిలిచిపోయిన విక్రయాలు...
 
తగ్గించిన ధరల వివరాలను చమురు కంపెనీలు గ్యాస్ ఏజెన్సీలకు పంపకపోవటంతో విజయవాడ నగరంలో, జిల్లాలో 76 గ్యాస్ ఏజెన్సీలలో సిలిండర్ల విక్రయాలు నిలిచిపోయాయి. ప్రతిరోజూ జిల్లాలో 21 వేల గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తారని అంచనా. ఆధార్ లింక్‌పై ప్రకటనలు గుప్పిస్తూ ప్రభుత్వం నుంచి సబ్సిడీ గ్యాస్‌పై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయకపోవటంతో గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఏడాదికి గతంలో ఇచ్చే తొమ్మిది సిలిండర్‌లను 12కి పెంచుతూ ప్రభుత్వం నుంచి గ్యాస్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. జరుగుతున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రెండు సిలెండర్లు ప్రతి వినియోగదారునికీ ఇస్తారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఏడాదికి 12 సిలెండర్లు సరఫరా చేయాలని గ్యాస్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 

Advertisement
Advertisement