మీరు చేసిన వెంటనే నేనూ చేస్తా : అశోక్‌బాబు | Sakshi
Sakshi News home page

మీరు చేసిన వెంటనే నేనూ చేస్తా : అశోక్‌బాబు

Published Mon, Dec 2 2013 2:28 AM

Ashok Babu Dares Chiranjeevi

 రాజీనామాపై చిరంజీవికి అశోక్‌బాబు సవాల్
సీపీఐ, సీపీఎం నేతలను కలిసిన ఏపీఎన్‌జీవో నేతలు
 
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి చిరంజీవి సహా సీమాంధ్రకు చెందిన 19 మంది ఎంపీలు రాజీనామా చేస్తే.. వారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేలోగా తనూ రాజీనావూ చేస్తానని ఏపీఎన్‌జీవోల సంఘం నేత అశోక్‌బాబు సవాల్ చేశారు. తాము రాజకీయ నాయకులం కాదని, అయినా రాష్ట్ర సమైక్యత కోసం రాజీనామాకు సిద్ధమని స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు, రాష్ట్ర శాసనసభకు వచ్చినప్పుడు వ్యతిరేకించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర సమైక్యతా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలు ఎన్‌జీవో సంఘాల నేతలు అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, టి.వి.సత్యనారాయణ, ఎం.వెంకటేశ్వరరెడ్డి, శ్రీరాం తదితరులు ఆదివారం హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎం నేతలను కలిశారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు గానీ, 2009 ఎన్నికల్లో గానీ రాష్ట్ర విభజన, యూటీ ప్రస్తావన తెచ్చి ఉంటే మిమ్మల్ని గెలిపించి ఉండేవాళ్లమే కాదు’’ అని చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చిరంజీవికి యూటీ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు.
 
మా వైఖరి మారదు: నారాయణ
తెలంగాణపై తమ వైఖరి మారదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఉద్ఘాటించారు. ఎన్‌జీవో నేతలు తొలుత సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి తదితరులను కలిసి చర్చలు జరిపారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రక్రియలో భాగంగానే తెలంగాణ వస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా రాకున్నా ప్రజాసమస్యలపై తమ పోరు ఆగదన్నారు. అశోక్‌బాబు మాట్లాడుతూ.. సీపీఐ వైఖరిని తాము ప్రశ్నించటం లేద న్నారు.
 
బిల్లును వ్యతిరేకిస్తాం: రాఘవులు
రాష్ట్ర విభజన బిల్లును తాము వ్యతిరేకిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు స్పష్టంచేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమను కలిసిన అనంతరం వారితో కలిసి రాఘవులు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి బిల్లు వచ్చినప్పుడు వ్యతిరేకిస్తూ మాట్లాడాల్సిందిగా ఎన్‌జీవో సంఘం నేతలు తమను కోరారని ఆయన చెప్పారు. ఎన్‌జీవోల భవిష్యత్ ఉద్యమాలకు ప్రత్యక్ష తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరారని, దీనిపై ఈ నెల ఐదో తేదీన జరిగే పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్‌జీవోలు నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామన్నారు.

Advertisement
Advertisement