సహాయక చర్యలకు పక్కా ఏర్పాట్లు: కిరణ్‌కుమార్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

సహాయక చర్యలకు పక్కా ఏర్పాట్లు: కిరణ్‌కుమార్‌రెడ్డి

Published Sun, Oct 13 2013 2:50 AM

సహాయక చర్యలకు పక్కా ఏర్పాట్లు: కిరణ్‌కుమార్‌రెడ్డి - Sakshi

సాక్షి, హైదరాబాద్: పై-లీన్ తుపాను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రాణనష్టాన్ని నివారించేందుకు ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేశామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తుపాను సహాయక కార్యక్రమాలపై ముఖ్యమంత్రి  శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘భారీ వర్షంతో పాటు తీవ్రవేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రాణనష్టం జరగకుండా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లను ఆదేశించాం. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు.
 
  ప్రత్యేకాధికారులుగా హైదరాబాద్ నుంచి వెళ్లిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా. ఆర్మీ, నేవీ సిబ్బందితోపాటు జాతీయ విపత్తు సహాయక దళాల సిబ్బందిని కూడా సహాయ కార్యక్రమాల కోసం సిద్ధంగా ఉంచాం. హెలికాప్టర్లు, బోట్లు సహా అన్నీ సిద్ధంగా ఉన్నాయి’ అని సీఎం వివరించారు.
 
 ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థ...: తుపాను వల్ల టెలిఫోన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయంగా వైర్‌లెస్ సెట్లు, శాటిలైట్ ఫోన్లు, హామ్ రేడియోలను సిద్ధం చేశామన్నారు. ప్రజలకు అందించేందుకు ఔషధాలు, మంచినీటి ప్యాకెట్లతో పాటు వైద్య సేవలకు సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలిచ్చామన్నారు. మంత్రులు ఆనం, సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, మహీధర్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement