Sakshi News home page

అందని మీ‘సేవ’

Published Tue, Oct 29 2013 2:36 AM

Available in your 'service'

గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : ప్రపంచం గుప్పెట్లోకొచ్చిన  నేపథ్యంలోనూ ప్రభుత్వం సాంకేతికంగా ఇంకా అభివృద్ధి సాధించలేదనేందుకు రాష్ట్రంలో మొరాయిస్తున్న ‘మీ సేవా’ కేంద్రాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన మీ సేవా కేంద్రాలు అనుకున్నంత ప్రగతిపథంలో పయనించలేకపోతున్నాయి.  జిల్లాలోని 167కేంద్రాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు మీసేవా సెంటర్లలో సర్వర్లు ఎప్పుడు పడితే అప్పుడు మొరాయిస్తున్నాయి. దీంతో వినియోగాదారులు నానా అగచాట్లకు గురవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ సెంటర్ల వల్ల నిత్యం బాధితులుగా మారిపోతున్నారు.  

సోమవారం పూర్తిగా సర్వర్ పడకేసిందని అంటున్నారు.   పుండు మీద కారం చల్లినట్లుగా ఈ కేంద్రాలను నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ మాత్రం ‘సర్వర్ అపుడపుడు పని చేస్తుంది...మీ సేవా ఆపరేటర్లు ఓర్పు వహించాలంటూ’ తమకు మెసేజ్‌లు పంపుతూ తమ ఓర్పును పరీక్షిస్తున్నారని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ, కుల, మరణ ధృవపత్రాలతో పాటు 157రకాల సేవలు అందించే తమకు ఆరు నెలలకు గానీ కమీషన్లు ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. ఏపీ ఆన్‌లైన్ వారు అయితే నెలనెలా ఆ సెంటర్ల ఆపరేటర్లకు కమీషన్లు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు.
 
విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు మంగళమేనా?

రాజీవ్ విద్యా దీవెన పథకం కింద ఏటా 9,10వ తరగతుల ఎస్సీ విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను  5నుంచి8వ తరగతి చదివే విద్యార్థులకూ  వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధృవపత్రాలు నిర్ధారించే రెవెన్యూ అధికారులు భారీవర్షాల నష్టపరిహార అంచనాల్లో నిమగ్నమవ్వడం, మీసేవా కేంద్రాల్లోని సర్వర్లు సరిగా పనిచేయకపోవడంతో సకాలంలో విద్యార్థులకు ధృవపత్రాలు అందే పరిస్థితి కనబడటం లేదు.

దరఖాస్తులు సమర్పించేందుకు నవంబరు 5వ తేదీతో గడువు ముగుస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.   ఈ క్రమంలో ఎన్నిసార్లు మీ సేవా సెంటర్లకు తిరిగినా చెప్పులు అరగటమే తప్ప కుల, ఆదాయ ధృవపత్రాలు చేతికి అందటం లేదని, నవంబరు నెలాఖరు వరకూ గడువును పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement