Sakshi News home page

నేడు చెన్నై అడయార్‌లో బాపు అంత్యక్రియలు

Published Tue, Sep 2 2014 2:16 AM

నేడు చెన్నై అడయార్‌లో బాపు అంత్యక్రియలు - Sakshi

చెన్నై, సాక్షి ప్రతినిధి: వృద్ధాప్య అనారోగ్య కారణాలతో ఆదివారం చెన్నైలో కన్నుమూసిన ప్రముఖ సినీ దర్శకుడు, చిత్రకారుడు బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చివరి ఘడియల్లో ఆయన ఏకైక కుమార్తె భానుమతి, రెండో కుమారుడు వెంకటరమణ బాపు చెంతనే ఉన్నారు. బాపు మరణానికి సరిగ్గా రెండు రోజుల కిందటే ఆయన పెద్దకుమారుడు వేణుగోపాల్ జపాన్ వెళ్లారు.

 

సోమవారం ఆయన చెన్నై చేరుకోగానే అంత్యక్రియలు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న వెంటనే తిరుగు ప్రయాణమైన వేణుగోపాల్ సోమవారం అర్ధరాత్రి చెన్నైకి చేరుకున్నారు. పెద్దకుమారుని రాక ఆలస్యం కావడంతో అంత్యక్రియలను మంగళవారానికి వాయిదావేశారు. చెన్నై అడయార్‌లోని బాపు ఇంటికి సమీపంలోని బీసెంట్‌నగర్ శ్మశాన వాటికలో మంగళవారం మధ్యాహ్నం బాపు పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బాపుకు కడసారి నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి హాజరు కానున్నారు.
 
 తరలివచ్చిన తెలుగు చిత్రసీమ...
 
 తమ అభిమాన బాపు కడసారి చూపుకోసం తెలుగు చిత్రసీమ సోమవారం తరలివచ్చింది. అశ్రు నయనాలతో వచ్చిన నటీనటుల ఆవేదనతో బాపు గృహం శోకసంద్రమైంది. తెల్లని సాధారణ పంచె, బనీను పోలిన తెల్లని చొక్కా ధరించి నిశ్శబ్దంగా తన పనిలో తాను నిమగ్నమై ఉండే బాపు అదే నిశ్శబ్దాన్ని కొనసాగిస్తున్నట్లుగా హాలు మధ్యలో ఐస్‌బాక్స్‌లో పార్థివదేహంగా కనిపించారు. నందమూరి బాలకృష్ణ, సినీ నేపధ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, దర్శకుడు శేఖర్ కమ్ముల సుమారు రెండు గంటల పాటు విషణ్ణవదనాలతో బాపు పార్థివదేహం వద్దనే కూర్చుండిపోయారు. పెళ్లిపుస్తకం చిత్రం ద్వారా బాపు బొమ్మగా పరిచయం అయిన సినీనటి దివ్యవాణి ఆయన భౌతికకాయం వద్ద, మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యూరు.
 
 భూమన నివాళులు
 
 బాపు మరణంతో.. ప్రపంచం గర్వించదగిన వ్యక్తిని తెలుగు జాతి కోల్పోయిందని వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి నివాళులర్పించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతినిధిగా భూమన సోమవారం చెన్నై చేరుకుని బాపు భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు భాషకు, సంస్కృతికి వన్నెలద్దిన వ్యక్తి బాపు అని కీర్తించారు. ఆయనలో అద్భుత మానవతావాది ఉన్నారని అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement