Sakshi News home page

వాట్ ఎన్ ఐడియా

Published Wed, Feb 5 2014 4:30 AM

Base Camp to set up a strategy for the preservation of the forest land

 లింగంపేట, న్యూస్‌లైన్ :  అడవులు అంతరించిపోతుండడం, అటవీ భూములు ఆక్రమణలకు గురవుతుండడం, వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతుండడంతో ఆ శాఖ అధికారులపై అనేక విమర్శలు వచ్చాయి. ఎక్కువగా గిరిజనులే అటవీ భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని అధికారులు భావిస్తున్నారు. వారు చెట్లను నరికి, భూములను చదు ను చేసి పంటలు పండిస్తున్నారు. అధికారులు కేసులు పెట్టినా వెనక్కి తగ్గడం లేదు.

అటవీ శాఖ అధికారులకు గిరిజనుల భాష రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు ఏం చెబుతున్నారో.. గిరిజనులు ఏం సమాధానం ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంటోంది. దీంతో గిరిజనులు అధికారులపై దాడులు చేసిన సంఘటనలూ ఉన్నాయి. ఈ పరిస్థితిని నిరోధించడానికి అటవీ శాఖ అధికారులు కసరత్తు చేశారు. వారికి ఓ ఐడియా తట్టింది. అడవులను ఆక్రమిస్తున్న గిరిజనులకే అటవీ భూముల సంరక్షణ బాధ్యత అప్పగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని భావించారు.

వెంటనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాంపులో ఐదుగురు నిరుద్యోగ గిరిజనులను ఎంపిక చేసి ఉద్యోగావకాశాలు కల్పించారు. జనవరి నుంచి బేస్ క్యాంపులు పనిచేస్తున్నాయి. గతేడాది అటవీ భూముల ఆక్రమణలు ఎక్కువగా జరిగిన లింగంపేట మండలం ఎక్కపల్లి తండా(ఎల్లారెడ్డి రేంజ్‌లోని బొల్లారం సెక్షన్‌లో ఉంది)లో అదే తండాకు చెందిన మున్యానాయక్ అనే యువకుడిని టీంలీడర్‌గా నియమించి బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు.

 ప్రస్తుతం ఇలా జిల్లాలో ఏడు క్యాంపులు పనిచేస్తున్నాయి. అదే విధంగా అటవీ శాఖలో కొత్తగా స్ట్రైకింగ్ ఫోర్స్ పేరిట మరికొన్ని బృందాలను కూడా నియమించారు. ఈ విధానం వల్ల నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు అడవులను, అటవీభూములను, వన్యప్రాణులను సంరక్షించవచ్చన్నది అటవీ అధికారుల ఆలోచన.

Advertisement

What’s your opinion

Advertisement