భంగపాటు! | Sakshi
Sakshi News home page

భంగపాటు!

Published Sat, Jan 4 2014 6:48 AM

BCs facing rough weather in TDP

సాక్షి, నిజామాబాద్: వలసలతో ఖాళీ అవుతున్న పార్టీని, ఎమ్మెల్యేల ను కాపాడుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేపడుతున్న చర్యలు.. పార్టీని నమ్ముకున్న వారికి తీ వ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ పార్టీ మారతారన్న ప్రచారం నేపథ్యంలో బుజ్జగింపు చర్యల్లో భాగంగా ఆమె తనయుడు మల్లికార్జునరెడ్డిని బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారని తెలుస్తోంది. దీంతో ఈ స్థానాన్ని ఆశించి పార్టీలో చేరిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత రాజారాం యాదవ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
 ఒత్తిడికి తలొగ్గి..
 రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు వంద టికెట్లు కేటాయిస్తానని చంద్రబాబు గతంలో ప్రకటించారు. బాల్కొండ టికెట్టు ఇస్తానని రాజారాం యాదవ్‌కు చెప్పి, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అయితే బాల్కొండ టికెట్టు తన తనయుడు మల్లికార్జున్‌రెడ్డికి ఇవ్వాలని అన్నపూర్ణమ్మ పట్టుబట్టి, పార్టీ అధినేతపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు నాయుడు.. బాల్కొండ తెరపైకి మల్లికార్జునరెడ్డిని తీసుకువచ్చారు. కాగా మల్లికార్జున్‌రెడ్డి రాజకీయాలకు కొత్త. ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, మాజీ మంత్రి, దివంగత మహీపాల్‌రెడ్డిల తనయుడిగా మాత్రమే ఆయన పరిచయం.
 
 అసంతృప్తి
 బాల్కొండ ఇన్‌చార్జిగా మల్లికార్జునరెడ్డి నియామకంతో పార్టీలోని బీసీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజారాం యాదవ్‌తోపాటు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌యాదవ్‌కు కూడా ఈ స్థానాన్ని ఆశించారు. పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తీరా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరిని కాదని మల్లికార్జునరెడ్డిని తెరపైకి తేవడంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
 
 ఒక్క బాల్కొండకే..
 జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. పలు నియోజకవర్గాలకు నాయకత్వం వహించేవారు లేరు. జుక్కల్ ఎమ్మెల్యే ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు. కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బాల్కొండతోపాటు ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్ అర్బన్‌లకు చాలా కాలం గా ఇన్‌చార్జిలు లేరు. వీటన్నింటిని పక్కనబెట్టి ఒక్క బాల్కొండకే ఇన్‌చార్జిని నియమించడం పార్టీలో చర్చనీయాంశమైంది. బాబు చర్యలతో పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Advertisement